Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమీషన్, త్వరలో ఖాళీ అవుతున్న 55 స్థానాలకు మార్చి 26న పోలింగ్
ఇందులో తెలంగాణ నుంచి 2 మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించేసింది.....
New Delhi, February 25: రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha Election) షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. మార్చి 26న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) షెడ్యూల్ ప్రకటించింది. 17 రాష్ట్రాల నుంచి మొత్తం 55 రాజ్యసభ స్థానాలు ఈ ఏప్రిల్ నెలలో ఖాళీ అవుతున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి 2 మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించేసింది.
షెడ్యూల్ ను ప్రకటిస్తూ ఈసీ ఇలా పేర్కొంది. "17 రాష్ట్రాల నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 55 మంది సభ్యుల పదవీకాలం 2020 ఏప్రిల్ నెలతో ముగియనుంది, మార్చి 26న ఈ 55 స్థానాలకు మార్చి 26న ఎన్నికలు జరుగుతాయి, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కించబడతాయి".
ఈసీ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం:
మార్చి 6న నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది.
నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ మార్చి 13
అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన మార్చి 16
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు మార్చి 18
పోలింగ్ తేదీ మార్చి 26న ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు .
మార్చి 26న సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కింపు, ఫలితాల ప్రకటన.
పెద్దల సభ లేదా ఎగువ సభగా పిలువబడే రాజ్యసభలో సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీసం ఒక్కో సభ్యుడికి 35-40 మంది శాసనసభ - శాసనమండలి సభ్యుల మద్ధతు అవసరం. ఏ పార్టీ అయితే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందో ఆ సంఖ్యను బట్టి ఆ పార్టీకి రాజ్యసభ స్థానాలు గెలుచుకోగలుగుతుంది. పార్లమెంటులో కీలక బిల్లుల ఆమోదం పొందాల్సిన సమయంలో రాజ్యసభ సభ్యుల మద్ధతుకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.