Huzur Nagar Verdict: తెలంగాణ పీసీసీ చీఫ్ ఇలాఖాలో ఎగురుతున్న గులాబీ జెండా, షాక్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, మూడో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి, పరువుపోగొట్టుకుంటున్న ఇతర పార్టీలు
ఆర్టీసీ సమ్మె విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సరైన స్టాండ్ తీసుకోకపోవడం, ఒకసారి గెలిపించినా కూడా రాజీనామా చేసి తిరిగి ఆయన భార్యనే పోటీలో నిలబెట్టడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది....
Huzur Nagar, October 24: హుజూర్ నగర్ ఉపఎన్నిక (Huzur Nagar Bypoll)కు కౌంటింగ్ కొనసాగుతుంది. మొత్తం 22 రౌండ్ల కౌంటింగ్ లో ఇప్పటికే 12 రౌండ్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి (Sanampudi Saidireddy) ప్రస్తుతం 23, 821 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో పద్మారెడ్డి (కాంగ్రెస్) కొనసాగుతుండగా, మూడోస్థానంలో స్వతంత్ర అభ్యర్థి సుమన్ కొనసాగుతుండటం విశేషం, నాలుగో స్థానంలో బీజేపి కొనసాగుతుంది. ఇక టీడీపీకి కనీస ఓట్లు కూడా పడకుండా పరువు పోగోట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ట్రెండ్స్ చూస్తే బీజేపీ, టీడీపీ పార్టీలకు డిపాజిట్లు దక్కే అవకాశం లేనట్లు తెలుస్తుంది.
కాగా, స్వయానా పీసీసీ చీఫ్ సొంత గడ్డలో టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉండటం, తమ స్థానాన్నే గెలుచుకోలేకపోతుండటంతో ఆ పార్టీ నిర్వేదంలో ఉంది. ఎవరూ కూడా ఈ ఫలితాలపై కమెంట్స్ చేసేందుకు ముందుకు రావడం లేదు. కొంత మంది చిన్న స్థాయి లీడర్లు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి పోలీసులే ఎన్నికల ప్రచారం చేశారంటూ ఎప్పట్లాగే పసలేని వాదనలు చేస్తున్నారు.
ఆర్టీసీ సమ్మె విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సరైన స్టాండ్ తీసుకోకపోవడం, ఒకసారి గెలిపించినా కూడా రాజీనామా చేసి తిరిగి ఆయన భార్యనే పోటీలో నిలబెట్టడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యూహాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమికి , టీఆర్ఎస్ పార్టీ గెలుపునకు ప్రధాన కారణాలుగా చెప్తున్నారు.