Asaduddin Owaisi: ఈ బక్రీద్ పండగకు కశ్మీరీలు మేకలను బలివ్వాలా? లేక తమనితాము బలిచ్చుకోవాలా? మోడీ ప్రభుత్వంపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం.
351: 72 ఓట్ల తేడాతో ఈ బిల్లు లోకసభలో నెగ్గింది. దీంతో ఉభయసభల్లో కాశ్మీర్ పునర్విభజ బిల్లుకు ఆమోదం లభించినట్లయింది....
New Delhi : ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాశ్మీర్ విభజన విషయంపై లోకసభలో చర్చ సందర్భంగా స్పందించారు. లోకసభలో మోడీ సర్కార్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 నిర్వీర్యం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం చేసిన 'మూడవ చారిత్రాత్మక తప్పిదం'గా ఓవైసీ అభివర్ణించారు.
జమ్మూకాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ తీసేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభచించడాన్ని ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా మోడీ ప్రభుత్వం తన ఎన్నికల హామీని నిలబెట్టుకుంది, అయితే అందుకోసం కశ్మీరీలకు రాజ్యాంగం కల్పించిన హక్కును తీసేసి వారికి తీరని ద్రోహం చేసిందని అన్నారు. జమ్మూకాశ్మీర్ లో ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడం, కమ్యూనికేషన్ లేకుండా చేయడం, కర్ఫ్యూ విధించడాన్నీ ఆయన తప్పుబట్టారు.
ఆయన మాట్లాడుతూ, 'మీ ఎంపీలందరూ ఇదొక పండగరోజు, అందరూ దీపావళి సంబరాలు జరుపుకునే రోజు అని మాట్లాడుతున్నారు. మరి ప్రస్తుతం కాశ్మీర్ లో ఒక్కరు కూడా బయటకొచ్చి సంబరాలు ఎందుకు చేసుకోవడం లేదు' అని ఆయన ప్రశ్నించారు. 'ఈ బక్రీద్ వాళ్లకు ఎలా ఉండబోతుంది? బక్రీద్ రోజున కశ్మీరీలు మేకలను బలివ్వాలా? లేక తమని తామే బలిచ్చుకోవాలా?' అని ఓవైసీ వ్యాఖ్యానించారు.
ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్ర ప్రాంతప్రాంతాలుగా విభజించడం దుర్మార్గం. ఈ ప్రభుత్వం ఎవరి మార్గాన్ని అనుసరిస్తుంది? నాజీ కూటమిలా వ్యవహరించే చైనా, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలలో లాగా నియంతృత్వ ధోరణులను బీజేపీ సర్కార్ అనుసరిస్తుందా? అని హెచ్చు స్వరంతో ప్రశ్నించారు. కాశ్మీరును భారతీయం చేస్తున్నామని బీజేపీ అనుకుంటుందేమో కానీ ఆ ప్రయత్నంలో మొత్తం భారతదేశాన్నే కశ్మీరీకరణం చేస్తుందని ఓవైసీ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, విస్తృత చర్చ తర్వాత మంగళవారం లోకసభలో కాశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందింది. 351: 72 ఓట్ల తేడాతో ఈ బిల్లు లోకసభలో నెగ్గింది. దీంతో ఉభయసభల్లో కాశ్మీర్ పునర్విభజ బిల్లుకు ఆమోదం లభించినట్లయింది.