PM Narendra Modi: ఏం చేశారు మీరు ఈ దేశానికి? కాంగ్రెస్ పార్టీ- యూపీఎ పాలనపై నిప్పులు చెరిగిన ప్రధాని నరేంద్ర మోదీ, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ తీర్చేశామని లోకసభలో కుండబద్దలు
మేము పాత ఆలోచనలు , విధానాల ప్రకారం పనిచేసి ఉన్నట్లయితే, ఆర్టికల్ 370 చరిత్రలో ఉండేది కాదు, ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లిం మహిళలు బాధలో మగ్గుతూ ఉండేవారు, రామ్ జన్మభూమి వివాదం అలాగే ఉండేది, కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ వాస్తవికరూపం దాల్చేది కాదు...
New Delhi, February 6: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Mod) తన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించుకున్నారు, తన పాలనలో చేపట్టిన అభివృద్ధికి సంబంధించిన పనులను ఆయన ఏకరువు పెట్టారు. గురువారం లోక్‌సభలో (Lok Sabha) రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం నూతన ఆలోచనలతో పనిచేసి అభివృద్ధికి వేగం ఇచ్చిందని అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఎ పాలనపై ఆయన నిప్పులు చెరిగారు, 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశం కోసం చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ అదే కాంగ్రెస్ పార్టీ ఉండి ఉంటే, అవే పాత ఆలోచనలతో పాలన నడుస్తుంటే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఇప్పటికీ అపరిషృతంగానే ఉండేవని మోదీ అన్నారు.
భారత ప్రజలు సర్కార్‌ను మాత్రమే మార్చలేదు, సరోకర్‌ను (అభిరుచి లేదా తలరాత) కూడా మార్చాలని వారు కోరుకున్నారు. మేము పాత ఆలోచనలు , విధానాల ప్రకారం పనిచేసి ఉన్నట్లయితే, ఆర్టికల్ 370 చరిత్రలో ఉండేది కాదు, ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లిం మహిళలు బాధలో మగ్గుతూ ఉండేవారు, రామ్ జన్మభూమి వివాదం అలాగే ఉండేది, కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ వాస్తవికరూపం దాల్చేది కాదు, భారతదేశం-బంగ్లాదేశ్ భూ ఒప్పందం జరిగి ఉండేది కాదు అని మోదీ పేర్కొన్నారు. రామ్ మందిర్ నిర్మాణం కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు లోకసభలో ప్రధాని మోదీ ప్రకటన
అలాగే ఇటీవల సంతకం చేసిన బోడో ఒప్పందాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. గత పాలకులు ఈశాన్య ప్రాంతాలను కొన్నేళ్లుగా విస్మరించారని తెలిపారు. "ఏళ్లుగా, ఈ ప్రాంతం వివక్షకు గురైంది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈశాన్యం అభివృద్ధికి ఇంజిన్‌గా మారుతోంది. అనేక రంగాలలో గొప్ప కార్యక్రమాలు జరిగాయి. మంత్రులు మరియు అధికారులు ఈ ప్రాంతాన్ని క్రమం తప్పకుండా సందర్శిస్తున్నారు" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బోడో ఒప్పందాన్ని ప్రశంసించుకున్న మోదీ, ఇవన్నీ గత పాలనలో కాగితాలకే పరిమితమయ్యాయని గుర్తుచేశారు.
రైతుల సమస్యలపై కూడా మాట్లాడిన ప్రధాని, రైతులకు కనీస మద్ధతు ధర పెంచిన ఘనత, గౌరవం తమకే దక్కిందని తెలిపారు. పీఎం-కిసాన్ సమ్మాన్ యోజన (తెలంగాణ రైతు బంధు పథకంతో స్పూర్థి పొందిన పథకం) పథకం చాలా మంది రైతుల జీవితాలను మారుస్తోందని మోదీ అన్నారు.