Jyotiraditya Scindia Joins BJP: 'ఈ దేశం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో సురక్షితంగా ఉంది'. బీజీపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా, ప్రధాని మోదీపై ప్రశంసలు
బీజేపీకి 107 ఎమ్మెల్యేల బలం ఉంది. మధ్యప్రదేశ్ ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 104 మంది ఎమ్మెల్యేల బలం అవసరం.....
New Delhi, March 11: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) అందరూ ఊహించినట్లుగానే తీవ్ర రాజకీయ ఉత్కంఠ నడుమ బుధవారం భారతీయ జనతా పార్టీలో (BJP) చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి, ప్రాథమిక సభ్యత్వ నమోదు రసీదును అందజేశారు. ఈ సందర్భంగా సింధియా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారతదేశ భవిష్యత్తు ప్రధాని మోదీ చేతుల్లో సురక్షితంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో ఎవరూ సాధించలేనన్ని సీట్లు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజీపీ గెలిచిందని, అది కూడా వరుసగా రెండు సార్లు అలా జరిగిందని సింధియా అన్నారు.
ఇక 18 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సింధియా నేడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోడానికి గల కారణాన్ని మీడియా ఎదుట వివరించారు. "నా జీవితంలో మార్పులు తీసుకొచ్చే 2 సంఘటనలు ఉంటాయి. ఒకటి నా తండ్రి చనిపోయిన రోజు కాగా, రెండోది నిన్న నా జీవితానికి మరో కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయం తీసుకోవడం" అని సింధియా అన్నారు. గతంలో ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదని ఆయన పేర్కొన్నారు. ప్రేజా సేవ లక్ష్యాన్ని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని సింధియా ఆరోపించారు.
ఇక, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, సింధియాకు మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేస్తారని తెలుస్తుంది. అటుపై కేంద్ర కేబినేట్ లోకి కూడా తెసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఎవరీ జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీతో సింధియాకు లింకేంటి?
జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది. ఆయనతో పాటు 22 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ఉపసంహరించుకున్నారు. దీంతో సీఎం కమల్ నాథ్ సర్కార్ కు అసెంబ్లీలో సంఖ్యా బలం 114 నుంచి 92కు పడిపోయింది. బీజేపీకి 107 ఎమ్మెల్యేల బలం ఉంది. మధ్యప్రదేశ్ ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 104 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ పాగా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతా అయిపోయి చేతులు కాలాక.. కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఎలాగైనా ప్రభుత్వాన్ని నిలుపుకోవాలని చూస్తుంది.