Maharashtra Irrigation Scam Case: రూ.70 వేల కోట్ల స్కాంలో కీలక మలుపు,అజిత్ పవార్ మీద ఉన్న కేసు కొట్టివేత, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిపోర్ట్, కేసు మూయలేదంటున్న ఏసీబీ డైరక్టర్ పరంబీర్ సింగ్
అజిత్ పవార్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలెదుర్కొంటున్నారు.
Mumbai, November 25: బీజేపీతో చేతులు కలిపి మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మలుపుకి కారణమైన అజిత్ పవార్ (Ajit Pawar) సహా ఎన్సీపీ అధినేత శరద్‌పవార్(Sharad Pawar)పైనా, ఇతర నేతలపైనా అనేక అవినీతి ఆరోపణలున్న సంగతి విదితమే. అజిత్ పవార్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 70 వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలెదుర్కొంటున్నారు.
బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి సహకరించిన అజిత్ పవార్ ఇప్పుడు క్లీన్ చిట్ తో బయటకు వచ్చారని సమాచారం. సుమారు రూ.70వేల కోట్ల విలువైన ఇరిగేషన్ స్కాంలో ఆయనకు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కేసును మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మూసేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీజేపీతో కలసి అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయిన రెండు రోజుల్లోనే ఈ కేసులో అజిత్ పవార్‌కు క్లీన్ చిట్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ఓ రిపోర్ట్ వైరల్ అవుతోంది.
అయితే ఏసీబీ డైరక్టర్ పరంబీర్ సింగ్ ఈ విషయాన్ని ఖండించారు. అజిత్ పవార్ కు సంబంధించి ఏ కేసు మూసివేయలేదని తాజాగా ప్రకటన చేశారు.
Ajit Pawar Irrigation Scam Case
1999 నుంచి 2014 మధ్య కాలంలో అజిత్ పవార్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో వివిధ సందర్భాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మనీ ల్యాండరింగ్ (Ajit Pawar Irrigation Scam Case)కి పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ కేసుని మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేసింది. విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ క్లియరెన్స్ లేకుండా 38 ప్రాజెక్టులకు అనుమతిచ్చినట్టు అజిత్ పవార్‌పై ఆరోపణలు(alleged corruption and irregularities in approval) వచ్చాయి.
అయితే తన నిర్ణయాలన్నీ సెక్రటరీ స్థాయి అధికారుల సిఫార్సుల ఆధారంగా తీసుకున్నవేనని అజిత్ పవార్ ఆ తరువాత సమర్థించుకున్నారు. సెప్టెంబర్ 2012న అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగారు. ఆ తరువాత తిరిగి నియామకం అయ్యారు.
ఇదిలా ఉంటే ఈ యేడాది సెప్టెంబర్‌లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెలముందు ఎన్సీపీ నేత శరద్‌పవార్, అజిత్‌పవార్‌లపై మనీ ల్యాండరింగ్ కేసులతో పాటు 25 వేల కోట్ల మహారాష్ట్ర స్టేట్ కోపరేటివ్ బ్యాంకు కుంభకోణం(maharashtra cooperative bank scam) కేసుని మోపారు. 2010 నవంబర్ 10 నుంచి 2014 సెప్టెంబర్ 26 వరకు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.
అయితే ఎటువంటి నిబంధనలను పాటించకుండా, ఆర్థిక బలాలను పరిగణనలోనికి తీసుకోకుండా చక్కెర ఫ్యాక్టరీలకు విచ్చలవిడిగా రుణాలివ్వడం ద్వారా జనవరి 1, 2007 నుంచి 2017 డిసెంబర్ 31 మధ్య కాలంలో ప్రభుత్వానికి 25 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణగా ఉంది.
ఎంఎస్సీసీ బ్యాంకుల నుంచి కోఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీలకు ఎటువంటి పూచీ లేకుండా రుణాలిచ్చి, ఆ తరువాత వాటిని ఖాయిలాపడ్డ పరిశ్రమలుగా చూపించారన్న ఆరోపణలున్నాయి. దీనిపై కేసు నడుస్తోంది. దీనిపై కూడా క్లీన్ చిట్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నాయి.