Janasena Long March Highlights: అధికార పార్టీపై విమర్శలతో ముగిసిన జనసేన లాంగ్ మార్చ్, జగన్ బాగా పరిపాలిస్తే సినిమాలు చేసుకుంటానన్న పవన్, మార్చ్‌లో టీడీపీ నేతలు, విమర్శల దాడి చేసిన వైసీపీ

విశాఖలోని మద్దిలపాలెం నుంచి ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహం వరకు ఈ లాంగ్ మార్చ్ జరిగింది. వేలాదిమంది జనసేన, టీడీపీ కార్యకర్తలు ఈ మార్చ్ లో పాల్గొన్నారు.

janasena-long-march-Highlights (Photo-ANI)

Visakhapatnam, Novemebr 4: ఇసుక కొరత నిరసిస్తూ విశాఖలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ను నిర్వహించారు. విశాఖలోని మద్దిలపాలెం నుంచి ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహం వరకు ఈ లాంగ్ మార్చ్ జరిగింది. వేలాదిమంది జనసేన, టీడీపీ కార్యకర్తలు ఈ మార్చ్ లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున టీడీపీ సీనియర్ నేతలు అచ్చన్నాయుడు, అయ్యన్నపాత్రుడు,జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, పార్టీ నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. లాంగ్ మార్చ్ తరువాత పాత జైలు ఎదురుగా ఈ సభను ఏర్పాటు చేశారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి సభలో కలకలం రేగింది.

సభ వద్ద ఏర్పాటు చేసిన జనరేటర్ నుంచి షార్ట్ సర్క్యూట్ కావడంతో.. ఇద్దరు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. ఇసుక కొరతకు నిరసనగా జరుగుతున్న సభలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం విషాదకరం.

ఇసుక కొరతపై జనసేన నిర్వహించే లాంగ్‌ మార్చ్‌లో 2.5 కి.మీ. వరకు పవన్‌ కల్యాణ్‌ నడుస్తారని ముందుగా ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. అయితే అభిమాను తాకిడి ఎక్కువ కావడంతో పవన్‌ నడవకుండా వాహనం పైన నిలబడి అభివాదం చేశారు. దీనిపై ఆ పార్టీ నాయకుల్లోనే అసంతృప్తి నెలకొన్నట్లుగా తెలుస్తోంది.

జనసేనాధినేత లాంగ్ మార్చ్

పవన్ కళ్యాణ్ స్పీచ్

జనాలు ఇళ్లు వదిలి రోడ్డెక్కారంటే ప్రభుత్వం సరిగా పని చెయ్యనట్లేనని పవన్‌ విమర్శించారు. ఏడాది వరకూ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు, పోరాటాలు చెయ్యనని అనుకున్నాననీ, అయితే భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోకపోవడంతో ఈ కవాతు చెయ్యాల్సి వచ్చిందన్నారు. ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలవుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రెండు వారాల్లో స్పందించి ఇసుక సరఫరాపై సరైన నిర్ణయం తీసుకోవడంతో పాటు, ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ.50 వేల పరిహారం, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. 5లక్షలు చొప్పున అందించాలని డిమాండ్‌ చేశారు. తనపై నమ్మకం లేకపోవడం, అనుభవం లేదనే కారణంతో తన అభిమానులు కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేశారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

టైం కావాలని వైసీపీ నేతలు అడుగుతున్నారు. జగన్ అద్భుత పాలన అందిస్తే.. నేను వెళ్లి సినిమాలు చేసుకుంటానని పవన్ తెలిపారు. రాజకీయ నాయకులు సక్రమంగా పరిపాలిస్తే.. తాను సినిమాలను వదిలి రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.వైఎస్ఆర్సీపీ వాళ్లు నాకు శత్రువుల కావన్న పవన్.. కన్నబాబును రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నాగబాబే అన్నారు. గాజువాకలో ఓడా, భీమవరంలో ఓడా.. కానీ నాకు పోరాడటం తెలుసన్నారు. ఓడిన వ్యక్తికి ఇంత ఘన స్వాగతం పలికారు.. ఏ పదవీ దానికి సరిపోదంటూ పవన్ ఉద్వేగానికి లోనయ్యారు.

నేను సీఎం అవుతానో లేదో పదవులు వస్తాయో లేదు తెలీదు.. కానీ కష్టం వచ్చిందని నా దగ్గరకు వచ్చిన ప్రజలకు అండగా ఉంటానని జనసేనాని తెలిపారు. ఏమీ ఆశించకుండా.. ఓ వ్యక్తి నిలబడ్డాడని ఈ సమాజానికి చెప్పడం కోసం పార్టీ పెట్టానన్నారు. జగన్ మీద ద్వేషం లేదు. జగన్ గొప్ప నాయకుడైతే.. నాకంటే ఎక్కువ సంతోషించే వ్యక్తి లేడన్న పవన్.. వైసీపీ పాలన ప్రజలను ఇబ్బంది పెడితే.. వాళ్లను ఎదుర్కోవడంలో నాకంటే బలవంతుడు లేడన్నారు. నాకు ప్రాణాల మీద తీపి లేదన్నారు.

అవంతి శ్రీనివాస్‌ విమర్శలు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసేది లాంగ్‌ మార్చ్‌ కాదని అది రాంగ్‌ మార్చ్‌ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో ఉన్నారని ఆరోపించారు. పవన్‌ కల్యాణ్‌ పూర్తిగా చంద్రబాబు కంట్రోల్‌లోకి వెళ్లిపోయాడని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్‌లు కలిసి తెరవెనుక రాజకీయాలు చేశారని.. ఇప్పడు బహిరంగంగా కలిసి రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనయుడు లోకేశ్‌ రాజకీయాలకు పనికిరాడని.. పవన్‌కు కేడర్‌ లేదని విమర్శించారు. అందువల్ల పవన్‌ను టీడీపీ అధ్యక్షుడిని చేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శలు

భవన నిర్మాణ కార్మికులపై పవన్‌కల్యాణ్‌ కపటప్రేమ చూపిస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. అసలు లాంగ్‌ మార్చ్‌ అనే పదానికి పవన్‌కల్యాణ్‌కు అర్థం తెలుసా అని ప్రశ్నించారు. కమ్యూనిస్ట్ నేత మావో ప్రపంచం కోసం చేసిన పదివేల కిలోమీటర్ల మార్చ్‌ను కీర్తిస్తూ పెట్టిన పేరు లాంగ్ మార్చ్ అని పేర్కొన్నారు. లాంగ్‌మార్చ్‌లో పవన్‌ రెండు కిలోమీటర్లు కూడా నడవలేకపోయారన్నారు. పవన్‌ చేసింది లాంగ్‌మార్చ్‌ కాదని..వెహికల్‌ మార్చ్‌ అని ఎద్దేవా చేశారు.

లాంగ్‌ మార్చ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. పవన్‌ ‘లాంగ్‌ మార్చ్‌’తో ప్రజలు నవ్వుకుంటున్నారని ట్విటర్‌ వేదికగా ఎద్దేవా చేశారు. ‘లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో 10 వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే పవన్‌ కల్యాణ్‌ ఇసుక ఆందోళనను లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ విమర్శలు

ఇసుక విధానంపై కనీస అవగాహన లేని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వ్యాఖ్యానించారు.ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన పవన్‌కు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబునాయుడు ఒకే బాటలో పయనిస్తున్నారని విమర్శించారు. తొలి నుంచీ ఇద్దరికీ రాజకీయ బంధం ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేతులు కలపడంతో మరోసారి బట్టబయలైందన్నారు.



సంబంధిత వార్తలు

2025 Toyota Camry: త్వ‌ర‌లోనే మార్కెట్లోకి 2025 టయోటా కమ్రీ కొత్త వెర్ష‌న్, ఇప్పుడున్న మోడ‌ల్ కు పూర్తి అప్ డేట్ తెస్తున్న కంపెనీ

AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

Union Cabinet Meeting Highlights: అమరావతికి హైదరాబాద్, చెన్నై, కోల్ కతాతో కనెక్టివిటీ, రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, కేంద్ర కేబినెట్ మీటింగ్ పూర్తి వివరాలు ఇవిగో..

AP Cabinet Meeting Highlights: ఒకేసారి మూడు సిలిండర్లు తీసుకోవడం కుదరదు, ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్‌ ఇవ్వాలని నిర్ణయం, ఏపీ కేబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..