KA MLAs Disqualification Case: మళ్లీ రసవత్తరంగా కర్ణాటక రాజకీయాలు, రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఊహించని మలుపు, యడ్యూరప్ప వ్యాఖ్యల టేపులను సాక్ష్యంగా తీసుకుంటామన్న సుప్రీంకోర్టు
రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత కేసు(KA MLAs Disqualification Case) ఊహించిన మలుపు తిరిగింది. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme court ) కీలక వ్యాఖ్యలు చేసింది.
Bengaluru,November 5: కర్ణాటక రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత కేసు(KA MLAs Disqualification Case) ఊహించిన మలుపు తిరిగింది. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme court ) కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను తామే ముంబైకి పంపించామని సీఎం యడ్యూరప్ప (BS yeddyurappa) చెబుతున్న ఆడియో, వీడియో టేపులనూ సాక్ష్యాలుగా తీసుకుంటామని సుప్రీంకోర్టు ప్రకటించింది. దీనికి ముందు ఈ టేపులను తీర్పు సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వాదించింది.
ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్–జేడీఎస్‌ల ప్రభుత్వాన్ని కూల్చారని సుప్రీంకు కాంగ్రెస్ కర్ణాటక విభాగం (Karnataka Congress) నివేదించింది. కర్ణాటకలో 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు తమపై అనర్హత విధించడం సబబు కాదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి విదితమే.
ఇదిలా ఉంటే రెబెల్ ఎమ్మెల్యేలపై తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప(chief minister B. S. Yediyurappa) తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ సమయంలో తాను రెబెల్ ఎమ్మెల్యే(Rebel Congress JD(S) MLAs)లను ముంబయి తరలించినట్లుగా మాట్లాడినట్లు లీకేజీ వీడియోలో వెల్లడి కావడంతో యడ్యూరప్ప ఈ ప్రకటన చేశారు.
నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోంది: యడ్యూరప్ప
కాగా రాజీనామా చేసిన అనర్హ ఎమ్మెల్యేల నిర్ణయం వారి సొంతమని దానితో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. అయితే తదుపరి ఏ చర్య తీసుకోవాలన్న దానిపై పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని, దీనిపై తమ పార్టీ జాతీయ అధ్యక్షునిదే తుది నిర్ణయం అని మాత్రమే తాను ఆ వీడియోలో అన్నానని, అంతకు మించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని ఆయన తెలిపారు.
రాజీనామా చేసిన రెబెల్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తామని తాను ఎప్పుడూ చెప్పలేదని, అయితే సుప్రీంకోర్టులో గందరగోళం సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి అర్థం లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా (BJP national president Amit Shah) రాజీనామా చేయాలనే డిమాండ్ మూర్ఖత్వం అని యడ్యూరప్ప పేర్కొన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.
యడ్యూరప్ప వ్యాఖ్యలు ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహించిందన్న విషయాన్ని అంగీకరించడమేనని ఈ వీడియో ఆధారంగా అది తెలిస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. రెండ్రోజులుగా తమ నిరసనలను కూడా వ్యక్తం చేస్తోంది. బీజేపీ కొనుగోళ్ల వ్యవహారానికి తెరలేపిందని మండిపడుతోంది. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సీఎం యడియూరప్ప వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కర్నాటక సీఎం యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలపై బీజేపీ (BJP )అంతర్గత విచారణ చేపట్టింది. పార్టీ కోర్ కమిటీలో మాట్లాడిన మాటలు అసలు బయటకెలా పొక్కాయి? అన్న కోణంలో విచారణ చేపట్టింది. కాంగ్రెస్, జేడీయూ సర్కారు కూల్చే సమయంలో 17 మంది రెబెల్ ఎమ్మెల్యేల సంగతి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చూసుకుంటారని, అంతా ఆయన కనుసన్నల్లోనే నడుస్తోందని బీజేపీ అంతర్గత సమావేశంలో యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల తర్వాత ఆ ఆడియో బయటపడింది.