KCR Ruling: వారికి చంద్రబాబును గుర్తుచేస్తున్న కేసీఆర్ పాలన. ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి. 'ప్రత్యేక' చాకిరిపై అసహనం. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కీసీఆర్ మళ్ళీ గెలుస్తారా? ప్రత్యేక కథనం

చాపకింద నీరులా భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో ఏం జరుగుతుంది? పూర్తివివరాలతో ప్రత్యేక కథనం ఇక్కడ చూడండి...

Telangana CM K. Chandrashekhar Rao. | File Photo.

Hyderabad, September 16: సాధారణంగా ఏ ఉద్యోగి అయినా అతడు ప్రభుత్వ ఉద్యోగి కావొచ్చు లేదా ప్రైవేట్ ఉద్యోగి కావచ్చు, వారంలో అన్ని దినాలు కష్టపడి శనివారమో లేదా ఆదివారమో తనకు లభించిన వారాంతపు సెలవులో విశ్రాంత్రి తీసుకుంటాడు. తిరిగి సోమవారం కాగానే మళ్ళీ యధావిధిగా ఉరుకులు పరుగులు. అయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, ఆయన ప్రవేశపెట్టే పథకాల అమలు కోసం అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులనే వాడటం పట్ల వారికి పనిభారం పెరగడంతో పాటు, వారాంతపు సెలవు కూడా లేకుండా పోతుంది. దీంతో అసలు విశ్రాంతి లేకుండా పనిచేయడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని కనబరుస్తున్నారు.

ఇటీవల సీఎం కేసీఆర్ '30 రోజుల ప్రణాళిక' (30 Days Scheme) ను ప్రవేశపెట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామాలను పరిశుభ్రంగా మార్చి, గ్రామాల్లో ఉన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ, మొత్తం గ్రామాల యొక్క రూపురేఖలను ఈ 30 రోజుల్లో సమూలంగా మార్చివేయడం ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రణాళిక అమలులో తాను ముఖ్యసేవకుడినంటూ ప్రకటించుకున్న కేసీఆర్ (CM KCR), ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఈ 30 రోజుల పాటు గ్రామాలలో సేవ చేయాలంటూ దిశానిర్ధేశం చేశారు. ఇందుకోసం అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక అధికారులు (Special Officers) గా నియమింపబడ్డారు. నేడు ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి గ్రామాల బాట పట్టి వారికి అప్పజెప్పిన విధులను నిర్వర్తిస్తున్నారు.

ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఇందులో పాలుపంచుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అసంతృప్తితో ఉన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టిన జన్మభూమి, శ్రమదానం కార్యక్రమాలను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకుంటున్నారు. ఉదయాన్నే లేవడం, భయంభయంగా పరుగులు తీయడం మళ్ళీ మొదలైనట్లుగా వారు భావిస్తున్నారు.

పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం  గ్రామాలకు సంబంధించిన  పనుల కోసం "గ్రామ వాలంటీర్స్" ను నియమించడాన్ని సైతం ఈ సందర్భంగా ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది?

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 30 రోజుల ప్రణాళిక జోరుగా అమలవుతోంది. ఊరూరా పరిసరాలను శుభ్రం చేయడం, మొక్కలు నాటడం, అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ విషయంపై ఉద్యోగులను ప్రశ్నించినపుడు వారిలో భయాందోళనలు కనిపించాయి. ఈ పనులు చేయకపోతే ఉన్నతాధికారుల ఆగ్రహానికి ఎక్కడ గురవుతామోనన్న భయంతో చేస్తున్నట్లుగా చెప్తున్నారు.చాలా ఊర్లలో అధికారుల హడావిడి అయితే కనిపిస్తుంది కానీ, అసలు సిసలు ప్రజాసేవకులుగా చెప్పుకునే ప్రజాప్రతినిధులు,  నాయకులు మాత్రం ఈ పనులకు దూరంగా ఉంటున్నారు. గ్రామ సర్పంచులు ఇది తమకు తప్పదు అన్నట్లుగానే పైనుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తూపోతున్నారు. వీరికి వార్డ్ మెంబర్ల నుంచి మద్ధతు కరువైంది. నాయకులు, ప్రజాప్రతినిధులు తమ వ్యాపారం, తమతమ సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక వర్షాకాలం సీజన్ కావడంతో ఊర్లలో చాలా మంది పొలం పనులకు వెళ్లిపోతున్నారు. ఇక్కడ ప్రజల భాగస్వామ్యం కూడా కొరవడింది.  ఎటొచ్చి ప్రభుత్వ ఉద్యోగులపైనే భారమంతా పడుతుంది.

కలుపుమొక్కలన్నీ తొలగించి పరిశుభ్రంగా మార్చిన వారంరోజులకే వర్షాలు పడీ మళ్ళీ ఎక్కడికక్కడ గడ్డి, కలుపు తయారవుతుంది. ఊర్లో ఒకసారి పశువుల మంద వెళ్లగానే అప్పటివరకు శుభ్రం చేసిన రోడ్లు మళ్ళీ యధాత స్థితికి వస్తున్నాయి. అయితే 30 రోజుల ప్రణాళిక వల్ల ఊరికి కొన్ని శాశ్వత ప్రయోజనాలు కలుగుతున్నప్పటికీ ఇది ఏదో 30 రోజుల్లో పూర్తి చేయాల్సిన వ్యవహారం కాదు, నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అనే అభిప్రాయం  వ్యక్తం అవుతుంది.  ఇందుకు గ్రామ పంచాయితీ, గ్రామ కమిటీలు మరియు ఇతర అనుబంధ సంస్థలు కీలకంగా చెప్తున్నారు.

ఉద్యోగుల మనోగతం ఎలా ఉంది?

ఒక వైపు తమ శాఖకు చెందిన విధులను నిర్వహించడంతో పాటు, అదనంగా "ప్రత్యేక అధికారి" పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమాల విధులను నిర్వర్తించడం వారికి భారంగా అనిపిస్తుంది. ఇదొక "ప్రత్యేక చాకిరి" గా వారు భావిస్తున్నారు. కొన్ని నెలల కింద సర్పంచి ఎన్నికలకు ముందు పంచాయతీ పాలనావ్యవహారాల కోసం ప్రభుత్వ ఉద్యోగులను "ప్రత్యేక అధికారులు"గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక అప్పట్నించీ ప్రతీ ప్రభుత్వ పనికి తమనే వాడుకోవడం పట్ల ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మారుమూల పల్లెలకు కనీసం సరైన రవాణా సదుపాయం లేదు, ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు లభించడం లేదు. గతంలో చంద్రబాబు హయాంలోనైనా ఉద్యోగులను తీసుకెళ్లి, తిరిగి తీసుకొచ్చేందుకు ప్రత్యేక వాహనాలు అద్దెకు తీసుకునేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇక మహిళా ఉద్యోగుల బాధ వర్ణణాతీతం. మహిళా ఉద్యోగులకు భద్రతా, వారికి 'కావాల్సిన వసతులు' లేలపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్లి గ్రామ సేవ చేసి ఇంటికి తిరిగొచ్చే సరికి రాత్రి అవుతుంది. దీంతో వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు.

ఇటు ప్రణాళిక అమలుకు సరైన నిధులు కూడా సమకూరడం లేదు, తమ సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని ఇటు సర్పంచులూ వాపోతున్నారు.

అవిశ్రాంతంగా పనిచేయడం, అనారోగ్య పరిస్థితుల్లో కూడా సెలవు దొరకకపోవడంతో ఈ ప్రభుత్వం పట్ల లోలోపల రగిలిపోతూనే, బయటకి మాత్రం ప్రశాంతంగా తమ విధుల పట్ల విధేయతను చాటుకుంటున్నారు. తమ ఈ పరిస్థితిని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలని వారు కోరుకుంటున్నారు.

కేసీఆర్ పై ప్రస్తుతం తెలంగాణ ప్రజల నాడి ఏ విధంగా ఉంది?

ఖచ్చితంగా సంక్షేమ పథకాల వల్ల ప్రస్తుతానికి సీఎం కేసీఆర్ పట్ల ప్రజల్లో ఇప్పటికీ అనుకూలత ఉంది. అయితే రాజకీయంగా మరియు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మాత్రం ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ఉద్యోగులు అంటే లక్షలాది ప్రభుత్వోద్యుగులతో పాటు వారి కుటుంబ సభ్యులు. గతంలో జన్మభూమి- శ్రమదానం పేరుతో తమను కష్టపెట్టిన చంద్రబాబును ప్రభుత్వ ఉద్యోగులు చరిచికొడితే ఆయన 10 సం. ల పాటు అధికారానికి దూరమయ్యారు. ఈ మధ్య రాష్ట్ర విభజన పుణ్యంతో మరోసారి ఏపిలో తన అనుభవం కారణంగా తిరిగి సీఎం అయినప్పటికీ ఒక్క టర్మ్ కాగానే ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే.

అయితే ఈ జన్మభూమి- శ్రమదానం వంటి కార్యక్రమాలు కూడా చంద్రబాబు కేబినేట్ లో తాను వ్యవసాయ మంత్రిగా పనిచేస్తున్నపుడు తానే ప్రవేశపెట్టానని ఒకసారి గతంలో ఒక ప్రకటనలో కేసీఆర్ పేర్కొన్నారు. అయితే అప్పుడు అవే  కార్యక్రమాలు చంద్రబాబుకు అధికారాన్ని దూరం చేశాయన్న విషయాన్ని  కేసీఆర్ ఇప్పుడు మరిచిపోయారా? అనేది ఉద్యోగ వర్గాల నుంచి వినిపిస్తుంది.

ఇక రెండోది, తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వారిని సైతం రాజకీయ పునరేకీకరణ అంటూ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్. ఆ సమయంలో నిజంగా తెలంగాణ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం పాటుపడిన వారిని మాత్రం విస్మరించారు. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. కేసీఆర్ కు భక్తులుగా పిలువబడే నాయకులు సైతం నిర్భయంగా కేసీఆర్ విధానాలను విమర్శించడమే అందుకు నిదర్శనం. అసలు ఈసారి కేబినేట్ విస్తరణలో భాగంగా హరీశ్ రావును పక్కనపెట్టి ఉంటే టీఆర్ఎస్ లో అసమ్మతి స్థాయి మరో స్థాయిలో ఉండేదని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ తన పార్టీలో రగిలిన అసమ్మతి కొంత చల్లార్చేందుకే తిరిగి హరీశ్ రావుకి ప్రాధాన్యత కల్పించారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడా?

పైన వివరించినట్లుగా ఉద్యోగులైతే అసంతృప్తితో ఉన్నారు, వారికి పీఆర్సీ అని, ప్యాకేజీలని ఎంత బుజ్జగించినా ఒకసారి తాము ఈ సీఎం వద్దు అనుకుంటే నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు. 'ముందు క్షేమం, ఆ తర్వాతే సంక్షేమం' అనేలా వారు ఆలోచిస్తారు.

ఇక తెలంగాణ వచ్చిన దగ్గర్నించీ సీఎంగా వ్యవహరిస్తున్న కేసీఆర్, మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ధీమా ప్రజల్లో కనబడటం లేదు. ఖచ్చితంగా కేసీఆర్ తీసుకునే నిర్ణయాలన్నీ జనామోద్యమైనవేమి కాదు. ఆయన తీసుకొనే కొన్ని నిర్ణయాల పట్ల ప్రజల్లో, నిరుద్యోగుల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఇక సొంత పార్టీలో అసమ్మతి అలాగే ఉంది.

ఇటు బీజేపీ కూడా రాష్ట్రంలో బలపడాలని ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీకి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు లేకపోయినా, ఒక హవా కొనసాగితే ఆ హవాలోనే అది ఎన్నికల్లో జయకేతనం ఎగరవేస్తుంది. గత ఎన్నికల్లో ఇది ఎన్నో సార్లు నిరూపితమైంది కూడా. ఈ విషయాలన్నీ సీఎం కేసీఆర్ గ్రహించకపోతే తన ఏకఛత్రాదిపత్యం కోల్పోయి ఏకాకిగా మిగిలే ఆస్కారం లేకపోలేదు.