President's Rule In 'MAHA': రాష్ట్రపతి పాలనలో మహారాష్ట్ర, గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు శివసేన, అత్యవసర మంత్రి వర్గ సమావేశం తరువాత బ్రెజిల్ విమానమెక్కిన ప్రధాని మోడీ
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బిజెపి,శివసేన, ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించినప్పటికీ ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్సీపీకి ఈ రాత్రి 8.30 వరకు గడువు ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనపడకపోవడంతో రాష్ట్రపతి పాలన కోసం కేంద్ర హోంశాఖకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేశారు.
Mumbai, November 12: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు పుల్‌స్టాప్ పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బిజెపి,శివసేన, ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించినప్పటికీ ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఎన్సీపీకి ఈ రాత్రి 8.30 వరకు గడువు ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనపడకపోవడంతో రాష్ట్రపతి పాలన కోసం కేంద్ర హోంశాఖకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సిఫారసు చేశారు. గవర్నర్ సిఫారసును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీంతో, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది.
ఇదిలా ఉంటే గవర్నర్ రాష్ట్రపతి పాలన విధిస్తే సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు శివసేన రెడీ అవుతోంది. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అహ్మద్ పటేల్‌లతో ఉద్ధవ్ థాక్రే చర్చించారని సమాచారం. మహరాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా.. బీజేపీ 105 సీట్లు, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లను గెలుపొందాయి. 13 మంది స్వతంత్రులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయగా ఇరు పార్టీలు కలిసి మ్యాజిక్ ఫిగర్‌ను అందుకున్నాయి.
రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర
అయితే ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం సీఎం పదవిని చెరో రెండున్నరేళ్ల కాలానికి పంచుకుందామని శివసేన డిమాండ్ కు బీజేపీ అంగీకరించడకపోవడంతో శివసేన అధికార ఏర్పాటుకు మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పింది. దీంతో అసెంబ్లీ తుది గడువు ముగుస్తుందనగా సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ శివసేనను ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీ ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించింది.
ఎన్డీయే నుంచి బయటకు వస్తేనే.. శివసేనకు మద్దతు ఇస్తామని ఎన్సీపీ తేల్చి చెప్పడంతో.. ఎన్డీయే కూటమి నుంచి శివసేన వైదొలిగింది. కానీ గవర్నర్ ఇచ్చిన గడువులోగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన లేఖను సమర్పించడంలో ఆ పార్టీ విఫలమైంది. అనంతరం గవర్నర్ ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ఈ గడువు ముగియక ముందే గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం ఆశ్చర్యపరిచే అంశం.
కోర్టుకు వెళ్లే ఆలోచనలో శివసేన
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించాలని సూచిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి పంపించిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గవర్నర్ సిఫారసులను ఆమోదించడానట్లుగా తెలుస్తోంది. అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ముగించుకున్న ఆ మరుక్షణమే నరేంద్ర మోడీ బ్రెజిల్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 13, 14 తేదీల్లో ఆయన బ్రెజిల్ లో ఏర్పాటు కానున్న బ్రిక్స్ దేశాల ఉన్నత స్థాయి సమావేశానికి హాజరవుతారు.