Mamata Banerjee: అచ్చేదిన్ అంటూ దేశాన్ని సర్వనాశనం చేశారు, ప్రధాని మోడీపై మండిపడ్డ మమతా బెనర్జీ, గోవా ఫార్వర్డ్ పార్టీతో పొత్తుపై దీదీ చర్చ
గోవాలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుపుకొని కూటమిగా బరిలోకి దిగనున్నారు. ఇందుకోసం గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్‌తో సమావేశమయ్యారు.
Panaji, October, 30: గోవాలో పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. గోవాలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కలుపుకొని కూటమిగా బరిలోకి దిగనున్నారు. ఇందుకోసం గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్‌తో సమావేశమయ్యారు.
గోవాలో పర్యటిస్తున్న మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అచ్చేదిన్ అచ్చేదిన్ అంటూనే దేశాన్ని సర్వనాశనం చేశారని దీదీ మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత కోసం గోవాలో మకాం వేసిన మమతాబెనర్జీ, గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్‌తో సమావేశమయ్యారు. వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీ, ఇంకా ఇతర చిన్నాచితకా పార్టీలు కలిసి పోటీచేసే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మమతాబెనర్జీ బీజేపీ పరిపాలనా తీరును ఎండగట్టారు. ‘దేశంలో ద్రవ్యోల్బణం అంతకంతకు పెరిగిపోతున్నది. గ్యాస్ సిలిండర్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు అసలు అడ్డుకట్టేలేదు. జీఎస్టీ కారణంగా దాదాపు అన్ని రకాల వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఎగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. అయినా అధికార బీజేపీకి సమస్యలను పరిష్కారించాలన్న సోయి లేకుండా పోయిందన్నారు. పైగా వాళ్లు ఇంకా అచ్చేదిన్ రానున్నాయని చెబుతున్నారు. కానీ దేశం ఇప్పటకే సర్వనాశనం అయిపోయిందని మమతా బెనర్జీ మండిపడ్డారు.
బీజేపీయేతర శక్తులన్నింటిని ఏకతాటిపైకి తెచ్చి ఆ పార్టీని అంతటా ఓడించడమే లక్ష్యంగా తాము పోరాడుతామని మమతాబెనర్జీ చెప్పారు. గోవా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్‌తో మాట్లాడానని, కలిసి పోటీచేసే విషయంపై ఇద్దరం చర్చించామని అన్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆయన ఇష్టమని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓటు చీలి పోకూడదనేది తన ఉద్దేశమన్నారు. కాగా, విజయ్ సర్దేశాయ్ కూడా మమతపై ప్రశంసలు కురిపించారు. పార్టీలో చర్చించి పొత్తు విషయంలో నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.