West Bengal Bypolls 2021: భవానీపూర్ నుంచి దీదీ ఘన విజయం, 58 వేల ఓట్లకు పైగా మెజారీటి, తనను గెలిపించిన భవానీపూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మమతా బెనర్జీ
బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో దీదీ ఘనవిజయం (Mamata wins landslide victory) సాధించారు.
Kolkata, Oct 3: భవానీపూర్ ఉపఎన్నికలో (West Bengal Bypolls 2021) మమతా బెనర్జీ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రీవాల్‌పై 58,389 ఓట్ల మెజార్టీతో దీదీ ఘనవిజయం (Mamata wins landslide victory) సాధించారు. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సొంత స్థానమైన భవానీపూర్‌ను వదిలేసి, నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఆరు నెలల్లోగా ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాల్సి ఉండగా, భవానీపూర్ టీఎంసీ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ ఆమె కోసం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలోకి దూసుకెళ్లిన మమతా.. ఆ తర్వాత ప్రతి రౌండ్‌కూ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు.మొత్తంగా మమతకు 84,709 ఓట్లు రాగా.. ప్రియాంకాకు 26,320 ఓట్లు వచ్చాయి. తన ఓటమిని ప్రియాంకా అంగీకరించారు. అయితే వాళ్లు లక్షకుపైగా మెజార్టీ గెలుస్తామని చెప్పారని, ఇప్పుడు అది 50 వేలకే పరిమితమైందని ఆమె అన్నారు. మరోవైపు తనను గెలిపించిన భవానీపూర్ ప్రజలకు మమత కృతజ్ఞతలు తెలిపారు.
ఇక్కడ 46 శాతం మంది బెంగాలీ కాని ఓటర్లు ఉన్నారు. వాళ్లంతా నాకే ఓటేశారు. నాపై నమ్మకం ఉంచినందుకు సంతోషం. భవానీపూర్ ప్రజలకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను అని మమతా అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ.. బీజేపీ నేత సువేందు అధికారి చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇన్నాళ్లూ ముఖ్యమంత్రిగానే కొనసాగుతున్నారు. ఆ పదవిలో కొనసాగాలంటే ఈ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో ఆమె బంపర్ మెజార్టీతో గెలిచారు.