LG Overrules Delhi CM's Order: దిల్లీలో ఎక్కడివారికైనా వైద్యం అందించాల్సిందే! సీఎం కేజ్రీవాల్ ఆదేశాలను రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
కేసులు తీవ్రతరం అవుతున్నందున దేశం నలుమూలల నుంచి దిల్లీకి వచ్చే రోగులకు చికిత్సను అందించడం అనేది అతిపెద్ద సవాలు లాంటిది. దీనివల్ల....
New Delhi, June 8: దిల్లీలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా చికిత్స తీసుకోవచ్చని గవర్నర్ అనిల్ బైజాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన దిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. దేశరాజధానిలో కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దిల్లీలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులలో కేవలం దిల్లీ వాసులకు మాత్రమే చికిత్స అందించబడుతుంది. కేంద్ర పరిధిలో నడిచే ఆసుపత్రుల్లో మాత్రం ఎవరైనా చికిత్స పొందవచ్చు అంటూ దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. (దిల్లీలో స్థానికేతరులకు చికిత్స అందించడం కుదరదు: సీఎం అర్వింద్ కేజ్రీవాల్)
అయితే సీఎం ఆదేశాలను తోసిపుచ్చుతూ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చే ఎవరికైనా తప్పనిసరిగా చికిత్సను అందించాలంటూ వైద్యశాఖకు ఆదేశాలు జారీ చేశారు. అనిల్ బైజాల్ దిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే, లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలపై దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులు తీవ్రతరం అవుతున్నందున దేశం నలుమూలల నుంచి దిల్లీకి వచ్చే రోగులకు చికిత్సను అందించడం అనేది అతిపెద్ద సవాలు లాంటిది. దీనివల్ల స్థానికులకు కనీస మౌలిక వైద్య సౌకర్యాలు కరువవుతాయి. అయితే అందరికీ చికిత్సనందించే ప్రయత్నం చేస్తామని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం తమ పాలనపై ప్రభావం చూపుతుందని అన్నారు.
Here's the update:
ఇదిలా ఉంటే, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఆయన జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో బాధపడుతుండటంతో వైద్యులు మంగళవారం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ కొన్నాళ్ల పాటు ఎవరినీ కలవకుండా దిల్లీలోని తన నివాసంలోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.