Botsa On YS Jagan 100 Days Ruling: 40 ఏళ్ల అనుభవం చేయలేనిది, 40 ఏళ్ల జగన్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చెప్తే వినే స్థితిలో ఎవరు లేరు. 'వారిద్దరిపై' ధ్వజమెత్తిన మంత్రి బొత్స సత్య నారాయణ.
పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎంత గగ్గోలు పెట్టినా, తమ ప్రభుత్వ విధానాలు తమకు ఉన్నాయని, ఆ రకంగానే ముందుకు వెళ్తామని మంత్రి బొత్స తేల్చి చెప్పారు...
Amaravathi, September 07: ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భగా మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మీడియా సమావేశం నిర్వహించారు. నాయకుడు అంటే ఎలా ఉండాలో జగన్ (YS Jaganmohan Reddy) చూపిస్తున్నారని తమ ముఖ్యమంత్రిని మంత్రి ప్రశంసించారు. ఈ 100 రోజుల పాలన చిరస్థాయిగా నిలిచిపోతుందని బొత్స అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, తాను ఇచ్చిన ప్రతీ హామీకి సమయం కేటాయిస్తూ వాటిని అమలు చేస్తూ ముందుకెళ్తున్నామని మంత్రి చెప్పారు. గతంలో కంటే ఇప్పుడే శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. 40 ఏళ్ల అనుభవం చేయలేని ఎన్నో పనులను జగన్ చేసి చూపిస్తున్నారని ఆయన తెలిపారు. గత చంద్రబాబు పాలనలో అధికారం ఉందని టీడీపీ నేతలు అహంకారంతో వ్యవహరించారని, ప్రజాస్వామ్యంలో చట్టాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయని మంత్రి వెల్లడించారు.
జగన్ పాలనను చూడలేక ఆక్రోశంతో, ఆవేశంతో, కడుపుమంటతో చంద్రబాబు తమది అరాచక ప్రభుత్వం, రాక్షస పాలన అంటూ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇక జగన్ పాలనను తుగ్లక్ పాలన అంటూ విమర్శిస్తున్న నారా లోకేశ్ అసలు తుగ్లక్ అంటే ఎవరో తెలుసుకోవాలని, చంద్రబాబుదే తుగ్లక్ పాలన అని కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి అన్ని సర్దుకొని చంద్రబాబు అమరావతి పారిపోయి వచ్చిన విషయం లోకేశ్ మరిచిపోయాడా అని బొత్స ఎదురు ప్రశ్నించారు.
అంతా తాత్కాలికం అంటూ రాజధాని అడ్రస్సే చంద్రబాబు గల్లంతు చేశారని మంత్రి ఆరోపించారు. అమరావతి రాజధాని అని ఆయన హయాంలో చంద్రబాబు ఏమైనా గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారా? తనకు తెలిసి అలాంటిది జరగలేదని, అమరావతిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ లాగా తనకు నటించడం రాదని మంత్రి అన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో వేటినైతే పవన్ సమర్థించారో అప్పుడు వాటినే వ్యతిరేకిస్తున్నారని ఆయన తీరును మంత్రి దుయ్యబట్టారు. మంత్రులు ఎలా వ్యవహరించాలో తమకు పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదని బొత్స స్పష్టం చేశారు.
పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎంత గగ్గోలు పెట్టినా, తమ ప్రభుత్వ విధానాలు తమకు ఉన్నాయని, ఆ రకంగానే ముందుకు వెళ్తామని మంత్రి బొత్స తేల్చి చెప్పారు.