Mission 2024: మిషన్ 2024 లక్ష్యంగా ఏకం కాబోతున్న విపక్షాలు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆధ్వర్యంలో నేడు 15 పార్టీల నేతల సమావేశం, ఇప్పటికే అందరికీ ఆహ్వానాలను పంపిన రాష్ట్రమంచ్ వ్యవస్థాపకులు యశ్వంత్‌సిన్హా, కీలక పాత్ర పోషించనున్న ప్రశాంత్ కిషోర్
కేంద్రంలోని ఎన్డీయే సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు మిషన్ 2024 (Mission 2024) ద్వారా ఏకమయ్యే వ్యూహాంలో ఉన్నాయి. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పావులు కదుపుతున్నారు.
New Delhi, June 22: ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు మిషన్ 2024 (Mission 2024) ద్వారా ఏకమయ్యే వ్యూహాంలో ఉన్నాయి. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్, శరద్ పవార్‌తో రెండో సారి భేటీ అయ్యారు.
సోమవారం ఢిల్లీలో ఇద్దరి మధ్య గంటన్నర పాటు రహస్య సమావేశం జరిగింది. మిషన్ 2024 లక్ష్యంగా బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కునేందుకు అన్ని పక్షాలను ఏకం చేసే పనిని ఈ సమావేశం ద్వారా మొదలుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 11న తొలిసారి ముంబయిలో పవార్‌ను కలిసి రాజకీయ ఏకీకరణపై చర్చించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోమవారం మరోసారి ఆయన్ని కలిశారు.
ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అనంతరం పవార్ ( Sharad Pawar) మంగళవారం విపక్షాల సమావేశం జరుగనున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో అత్యంత సీనియర్లుగా ఉన్న ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్, ఇటీవల తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాలు (Yashwant Sinha) సంయుక్తంగా ఈ సమావేశాన్ని (Sharad Pawar to Host Meeting of Opposition Leaders) ఏర్పాటు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.
ఇప్పటికే 15 రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు అందాయి. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో పవార్ నివాసంలో ఈ సమావేశం జరుగనున్నది. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఎదుర్కోవడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవుతుందన్న ఊహలకు మరింత బలం చేకూరింది. పవార్ అన్ని విపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ( Nawab Malik) అన్నారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ హోరాహోరీ పోరులో భాజపాను మమతా బెనర్జీ ఓడించడం ప్రతిపక్షాలకు ఉత్సాహాన్నిచ్చింది. అలాంటి పట్టుదలతో ఉన్న పార్టీలన్నీ మంగళవారం నాటి సమావేశంలో పాల్గొనడానికి సుముఖత వ్యక్తంచేసినట్లు సమాచారం. తొలుత మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడిగా పోరాటం మొదలుపెట్టి క్రమంగా ఆయనను ఢీకొట్టే నేతను ఎంపికచేసే దిశగా ప్రతిపక్షాలు పయనించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాపై ప్రత్యామ్నాయ కూటమిని నిలబెట్టి అక్కడి ఫలితాలను భవిష్యత్తు కార్యాచరణకు వేదికగా మలచుకొనే ఆలోచనతోనే ఈ సమావేశానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
యశ్వంత్‌సిన్హా వ్యవస్థాపకునిగా ఉన్న రాష్ట్రమంచ్ ద్వారా నేతలకు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), యశ్వంత్ సిన్హా (తృణమూల్), సంజయ్ సింగ్ (ఆప్), డి.రాజా (సీపీఐ) వంటి 15 మంది నేతలతో పాటు మాజీ సీఈసీ ఎస్.వై.ఖురేషి, సీనియర్ న్యాయవాది కె.టి.ఎస్.తులసి, బాలీవుడ్ ప్రముఖులు జావేద్ అఖ్తర్, ప్రీతీష్ నంది, ప్రముఖ పాత్రికేయుడు కరణ్‌థాపర్ తదితరులు దీనికి హాజరవుతారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ముంబయిలో తెలిపారు.
మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో దీనిపైనే ప్రశాంత్ కిశోర్ (poll strategist Prashant Kishor) ఆయనతో భేటీ అయ్యారేమోనన్న ప్రశ్నలు మొదలయ్యాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రశాంత్ కిశోర్ ఆయనకు సూచించినట్టు తొలిసారి భేటీ అనంతరం రాజకీయ వర్గాల్లో వినిపించింది.
బెంగాల్ సీఎం మమత కూడా ‘మోదీని గద్దె దించడానికి కలిసి పోరాడదాం’ అని గతంలో పిలుపునిచ్చారు. కాగా, థర్డ్ ఫ్రంట్ ఊహాగానాలను ప్రశాంత్ కిశోర్ కొట్టిపారేశారు. బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ లేదా ఫోర్త్ ఫ్రంట్ విజయవంతం అవుతాయని తాను భావించడం లేదన్నారు. అయితే అందుకు కారణాలను పేర్కొనలేదు. పవార్‌తో భేటీకి ముందు ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్య బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే.. బీజేపీకి దీటుగా నిలిచే సత్తా మీకూ ఉన్నదంటూ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు రాగానే తాను ఈ ఎన్నికల వ్యూహకర్త పనికి ఇక గుడ్‌బై చెప్పినట్లు ప్రకటించిన ప్రశాంత్ కిశోర్.. అప్పుడే పవార్‌తో సమావేశాలు, ప్రతిపక్షాల భేటీకి పిలుపులు ఇస్తుండటం గమనార్హం.