New Delhi, June 22: దేశంలో గత 24 గంటల్లో 42,640 కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 19 నుంచి (91 రోజుల్లో) ఇంత తక్కువ సంఖ్యలో కేసులు ( COVID19 Cases India) నమోదు కావడం ఇదే మొదటిసారి. 91,839 మందికి స్వస్థత చేకూరి డిశ్చార్జి కాగా, 1,167 మరణాలు చోటుచేసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,77,861కి (Covid in India) చేరుకోగా, 2,89,26,038 మంది డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6,62,521గా ఉంది. మృతుల సంఖ్య 3,89,301 చేరింది. ఇంతవరకూ 28,87,66,201 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు.
రానున్న రోజుల్లో దేశంలో కరోనా థర్డ్‌వేవ్ (Coronavirus Third Wave) అనివార్యమని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్-అక్టోబర్ మధ్యకాలంలో థర్డ్‌వేవ్ గరిష్ఠానికి చేరుకునే అవకాశాలున్నట్లు ఐఐటీ కాన్పూర్ నిపుణులు అంచనా వేశారు.అటు విధాన రూపకర్తలకు ఇటు సామాన్య ప్రజలకు కరోనా వైరస్ థర్డ్‌వేవ్‌పై ఆందోళన మొదలయ్యింది.
ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని SIR మోడల్ ఆధారంగా థర్డ్‌వేవ్‌ను అంచనా వేశామని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ రాజేష్ రంజన్ పేర్కొన్నారు. జులై 15వరకు దేశవ్యాప్తంగా మొత్తం అన్‌లాక్ ప్రక్రియ జరిగితే.. థర్డ్‌వేవ్ గరిష్ఠతను తాకే సంభావ్యతను మూడు విభాగాల్లో అంచనా వేశామని చెప్పారు.
1 (Back to Normal): థర్డ్‌వేవ్ అక్టోబర్‌లో గరిష్ఠానికి చేరుకుంటుంది. కానీ, సెకండ్ వేవ్‌తో పోలిస్తే తీవ్రత తక్కువగానే ఉంటుంది.
2 (Normal With Virus Mutations): సెకండ్ వేవ్‌లో గరిష్ఠం కన్నా ఎక్కువగా ఉంటే అది సెప్టెంబర్ నాటికే కనిపించవచ్చు.
3 (Stricter Interventions): ఒకవేళ భౌతిక దూరం, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే కొవిడ్ గరిష్ఠ స్థాయిని అక్టోబర్ చివరకు ఆలస్యం చేయవచ్చు. అయినప్పటికీ సెకండ్ వేవ్‌తో పోలిస్తే ఈ గరిష్ఠ తీవ్రత తక్కువగా ఉంటుందని ఐఐటీ కాన్పూర్ అధ్యయనం అంచనా వేసింది. కొన్ని ఈశాన్య రాష్ట్రాలు (మిజోరాం, మణిపూర్, సిక్కిం రాష్ట్రాలు) మినహా దేశంలో సెకండ్ వేవ్ పూర్తిగా క్షీణించిపోయిందని తాజా అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రాజేష్ రంజన్, మహేంద్ర వర్మతో పాటు ఆయన బృందం స్పష్టం చేసింది.
ప్రస్తుతం దేశంలో కేరళ, గోవా, సిక్కిం, మేఘాలయా రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి ఎగువన ఉండగా.. చాలా రాష్ట్రాల్లో మాత్రం ఇది 5శాతం కంటే తక్కువగానే ఉందని పేర్కొంది. అయితే, ఈ మోడల్‌లో కరోనా వ్యాక్సినేషన్‌ను పరిగణలోకి తీసుకోలేదని.. ఒకవేళ అలా తీసుకుంటే గరిష్ఠ స్థాయి తీవ్రత తగ్గుతుందని ఐఐటీ నిపుణులు పేర్కొన్నారు. వీటికి సంబంధించిన మరో అధ్యయన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.