Mithun Chakraborty Joins BJP: తాను మాములు పాము కాదు, కోబ్రా అంటూ.. కాషాయం కండువా కప్పుకున్న తృణమూల్ మాజీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి, బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్

తృణమూల్ మాజీ నేత, హిందీ, బెంగాలీ సినిమాల్లో పేరు పొందిన నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం భారతీయ జనతా పార్టీలో (Mithun Chakraborty Joins BJP) చేరారు.

Mithun Chakraborty Joins BJP (Photo Credits: Twitter)

West Bengal, March 7: తృణమూల్ మాజీ నేత, హిందీ, బెంగాలీ సినిమాల్లో పేరు పొందిన నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం భారతీయ జనతా పార్టీలో (Mithun Chakraborty Joins BJP) చేరారు. కోల్‌కతాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన బీజేపీలో చేరారు.

బీజేపీ బెంగాల్ వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఇదే సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రధాని మోదీయే స్వయంగా కండువా కప్పి, పార్టీలోకి ఆయన్ను ఆహ్వానిస్తారని భావించారు. కానీ మోదీ రాక మునుపే ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.

బెంగాల్‌లో నివసించే వారందరూ బెంగాలీలే అని నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) స్పష్టం చేశారు. ఓ బెంగాలీగా తానెంతో గర్వపడతానని, ప్రజలందరూ తన సినిమా డైలాగులను ఇష్టపడతారన్న విషయం తెలుసని పేర్కొన్నారు. తాను మాములు పాము కాదని, కోబ్రానని వ్యాఖ్యానించారు.

తాను దేశానికి ఏదో చేయాలని ముందునుంచీ భావించేవాడినని, అయితే నా కలలు నిజమై, ఇప్పుడు కనిపిస్తున్నాయని పరోక్షంగా మోదీ పాలనను మెచ్చుకున్నారు. బెంగాలీల నుంచి ఎవరైనా దేనినైనా లాగేసుకుంటే, అందరమూ దానిని అడ్డుకుంటామని అన్నారు. తన పేరు మిథున్ చక్రవర్తి అని, ఏది చెబితే అది చేస్తానని మిథున్ తెలిపారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఒకేసారి 291 అభ్యర్థుల జాబితా విడుదల, ఈసారి తాను నందిగ్రామ్ నియోజకర్గం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన బెంగాల్ సీఎం

ఇదిలా ఉంటే మిథున్ చక్రవర్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారా? అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌ను అడగగా... ముందు ఆయనను బీజేపీలో చేరనివ్వండి... దీని గురించి నా దగ్గర ఎటువంటి సమాచారం ప్రస్తుతానికి లేదని అన్నారు. మిథున్ ప్రధానిని కలుసుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు.

294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో మమత బెనర్జీ, సువేందు అధికారి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.