West Bengal Assembly Polls 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఒకేసారి 291 అభ్యర్థుల జాబితా విడుదల, ఈసారి తాను నందిగ్రామ్ నియోజకర్గం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన బెంగాల్ సీఎం
File image of West Bengal CM Mamata Banerjee (Photo Credit: File Photo)

Kolkata, March 5: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గానూ టీఎంసీ తరఫున 291 అభ్యర్థుల పేర్ల జాబితాను ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ప్రకటించారు. చేశారు. ఈసారి ఆమె నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. మరో మూడు సీట్లను మమతా తమ మిత్రపక్షమైన గూర్ఖా జన్ముక్తి మోర్చా (జిజెఎం) కోసం కేటాయించారు.

శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన దీదీ, తాను 2011 నుంచీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భువానిపూర్ నియోజకవర్గం నుంచి కాకుండా ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం పూర్తి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మొదటి రాజకీయ పార్టీ తమదే అని మమత పేర్కొన్నారు. టీఎంసీ ప్రకటించిన 291 మంది అభ్యర్థులలో 50 మంది మహిళలు, 79 ఎస్సీలు, 17 ఎస్టీలు మరియు 42 ముస్లిం అభ్యర్థులు ఉన్నారని తెలిపారు. ఉత్తర బెంగాల్ లోని డార్జిలింగ్, కాలింపాంగ్ మరియు కుర్సోంగ్ నియోజకవర్గాలలో తమ మిత్రపక్షం అయిన గూర్ఖా జన్ముక్తి మోర్చా (జిజెఎం) అభ్యర్థులు పోటీ చేస్తారని దీదీ స్పష్టం చేశారు.

ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి మద్ధతు లభిస్తుందని మమతా ధీమా వ్యక్తం చేశారు. అలాగే తమ పార్టీకి ఆర్జేడీ పార్టీ, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ మద్ధతు ప్రకటించినట్లు ఆమె పేర్కొన్నారు.

 Full List of TMC Candidates for West Bengal Assembly Polls 2021:

ఇదిలా ఉంటే, మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం నుంచి కాకుండా ఈసారి నందిగ్రామ్ నుంచి పోటీకి దిగటం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ స్థానంలో మమత బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన నందిగ్రామ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సువేందు అధికారి గత డిసెంబర్ నెలలో బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో మమత నందిగ్రామ్ స్థానం ఎంచుకోవటంపై రాజకీయంగా ఆసక్తి రేకిస్తుంది. మరోసారి ఈసారి ఎలాగైనా మమతా బెనర్జీని సీఎం కుర్చీ నుంచి దించేయాలని బీజేపీ అన్ని రకాల వ్యూహాలను సిద్ధం చేస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తుంది. దీంతో ఈసారి పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగనుంది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27 నుండి ఎనిమిది దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 29న పోలింగ్ ముగియనుండగా, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి మే 2న జరుగుతుంది.