Chandrababu vs Jagan: చంద్రయాన్-2 లో స్పందించని విక్రమ్ ల్యాండర్ లాగే చంద్రబాబు చర్యలకు ఏమాత్రం స్పందించని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.
జగన్మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదు. గత కొంతకాలంగా, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరియు ఆయన పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు....
Amaravathi, September 11: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకొని ముందుకు అడుగులు వేస్తుంది. అయితే ఈ వంద రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి తన పాలనలో ఎదురయిన సవాళ్ల కంటే, ప్రతిపక్షం నుంచి ఎదురయిన, ఎదురవుతున్న సవాళ్లే అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ సర్కార్‌ను విమర్శించని రోజంటూ లేదు. మధ్యమధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ సర్కారును నిలదీస్తూ వచ్చారు. అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విధానపరమైన నిర్ణయాల్లో తేడా వచ్చినపుడు మాత్రమే బీజేపి నోరు మెదిపింది. ఇక మిగతా పార్టీల ఊసు అసలే లేదు.
గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల రద్దు దగ్గర్నించీ
జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దాడి ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రజావేదిక కూల్చినపుడు కొన్నాళ్ల పాటు జగన్ విధ్వంస పాలన చేస్తున్నారని, మరికొన్నాళ్ల పాటు కృష్ణనది వరదల కారణంగా వైసీపీది విఫల ప్రభుత్వం అని, జగన్ ఒక విఫల ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు బృందం జగన్ పాలనను విమర్శిస్తూ వచ్చింది. ఇక అమరావతి తరలింపు అనే ఊహాగానాలు వచ్చినపుడు జగన్ సర్కార్ పై టీడీపీ స్వరం మరింత పెంచింది. ఇక్కడ్నించి టీడీపీకి జనసేన పార్టీ కూడా తోడైంది. అమరావతిలో భూముల వ్యవహారంలో జగన్ ప్రభుత్వం మరియు టీడీపీ+ జనసేన మధ్య జరిగిన విమర్శలు తారాస్థాయికి చేరాయి. కొన్నాళ్ల తర్వాత ఈ వ్యవహారమూ చల్లబడగానే జగన్ అరాచక పాలన చేస్తూన్నారంటూ మరో వివాదం రాజుకుంది.
మీది అరాచక పాలనంటే, మీదే అరాచక పాలనంటూ టీడీపీ మరియు వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో తాజా పరిస్థితి ఎలా ఉందో ప్రజలంతా గమనిస్తున్నారు.
అయితే ఇంత జరుగుతున్నా అసలైన వ్యక్తి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మాత్రం నోరు మెదపడం లేదు. పైన వివరించినట్లుగా గత కొంతకాలంగా, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరియు ఆయన పాలనపై ఎంతగా ధ్వజమెత్తినా, ఎంతగా రెచ్చగొట్టినా ఇంకా చెప్పాలంటే చంద్రయాన్ 2లో ఇస్రో ఎంత గట్టి ప్రయత్నాలు చేసినా స్పందించని విక్రమ్ ల్యాండర్ లాగా జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా ఎలాంటి స్పందనలు లేవు.
ఒక వివాదం నుంచి మరో వివాదం లాగా చంద్రబాబు మరియు టీడీపీ ఎంతగా పోరాడుతున్నా ఏ దశలోనూ సీఎం జగన్ వారిని పట్టించుకోలేదు. కేవలం తన మంత్రులు, ఇతర పార్టీ నాయకులే చంద్రబాబుకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.
ఈరోజు టీడీపీ తలపెట్టిన "చలో ఆత్మకూరు' కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. చంద్రబాబు సహా టీడీపీ ముఖ్యనాయకులందరినీ పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దాదాపు జాతీయ స్థాయిలో ఈ వ్యవహారానికి పబ్లిసిటీ వచ్చింది. అయినప్పటికీ సీఎం జగన్ వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు ప్రభుత్వ అధికారులతో వివిధ పథకాలపై సమీక్షలు, టెలీకాన్ఫరెన్సులు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. విశేషమేమిటంటే ఇంత జరుగుతున్నా ఏ మాత్రం స్పందించని సీఎం జగన్, తాను ఈరోజు నిర్వహిస్తున్న కార్యక్రమం పేరు "స్పందన".
ఏదేమైనా, అటూ ఇస్రోకు విక్రమ్ ల్యాండర్, ఇటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి తగిన స్పందనలు ఇవ్వాలని. తాజా పరిస్థితిపై ప్రజలకు వివరించి ప్రస్తుతం నెలకొన్న టెన్షన్ వాతారణాన్ని తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.