PM Modi Greetings: పాకిస్థాన్ మినహా మిగతా భారత్ పొరుగు దేశాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని నరేంద్ర మోదీ

అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలలో పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ, అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపిస్తారన్న పుకార్లు వ్యాప్తి చెందుతున్న వేళ్ల ప్రధాని మోదీ, బంగ్లాదేశ్, భూటాన్ మరియు నేపాల్ దేశాధినేతతో సంతృప్తికర సంభాషణలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది....

File image of PM Narendra Modi (Photo Credits: IANS)

New Delhi, January 2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  (PM Narendra Modi) భారత్ పొరుగు దేశాల ప్రధాన మంత్రులకు, అధ్యక్షులకు ఫోన్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు (New Year Greetings) తెలియజేశారు. అయితే ఆయన జాబితాలో పాకిస్థాన్ ప్రధానమంత్రికి స్థానం ఇవ్వలేదు.

భారతదేశానికి 'ఇరుగుపొరుగు ప్రథమం' (Neighborhood First)   అనే పాలసీ ప్రకారం పొరుగు దేశాల పట్ల భారతదేశం యొక్క నిబద్ధతను మోదీ ఈ సందర్భంగా ఎత్తిచూపారు. భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్ మరియు నేపాల్ నాయకులతో మోదీ సంభాషించారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, శాంతి, భద్రత, దేశాల ప్రగతి మరియు ప్రజల శ్రేయస్సు తదితర అంశాలపై ఆయా దేశాల నాయకులతో మోదీ చర్చించారు.

అయితే, పాకిస్థాన్ ప్రధానిని మోదీ ఈసారి దూరం పెట్టారు. గతేడాది ఫిబ్రవరి 14 న, జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఆత్మాహుతి దాడిలో 40 మంది పారామిలిటరీ సైనికులు అమరులయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు పాకిస్తాన్ యొక్క బాలకోట్లోని జైష్-ఇ-మొహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. అప్పట్నించి, జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసేవరకు భారత్- పాక్ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఇప్పటికీ కూడా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కొన్ని నెలల క్రితం కూడా పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ తో చర్చలకు సిద్ధం అంటూ ప్రకటించింది. అయితే ప్రతీసారి పాక్ కు దీటైన జవాబు ఇచ్చిన భారత్, శాంతి చర్చలు- ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి నడవలేవని పునరుద్ఘాటించింది.

పాకిస్థాన్ ను భారత్ దాయాది దేశంగా పరిగణిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ పొరుగు దేశాల నేతలందరికీ శుభాకాంక్షలు తెలిపి పాకిస్థాన్ ను మినహాయించడం పట్ల ఆ దేశంపై భారత్ వైఖరి ఏంటనేది ప్రధాని మరోసారి స్పష్టం చేసినట్లయింది. అదే సమయంలో ఉగ్రవాదంపై పోరాటం దిశగా కలిసి వచ్చే పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తామని చాటి చెప్పినట్లయింది.

అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలలో పౌరసత్వ సవరణ చట్టంపై తీవ్ర నిరసనలు కొనసాగుతున్న వేళ, అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపిస్తారన్న పుకార్లు వ్యాప్తి చెందుతున్న వేళ్ల ప్రధాని మోదీ, బంగ్లాదేశ్, భూటాన్ మరియు నేపాల్ దేశాధినేతతో సంతృప్తికర సంభాషణలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అదే రకంగా ఈ దేశాలతో చైనా అమలుపరుస్తున్న వ్యూహాలను తాము గమనిస్తున్నామనే సంకేతాలు చైనాకు ఇచ్చినట్లయింది.