Presidential Elections 2022: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, జూలై 21న ఫలితాలు, జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేపారన్న యశ్వంత్ సిన్హా
పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటేయగా.. రాష్ట్రాల అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలు 21న విడుదల కానున్నాయి. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
New Delhi, July 18: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటేయగా.. రాష్ట్రాల అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఫలితాలు 21న విడుదల కానున్నాయి. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్(Secret Ballet Voting) విధానంలో పోలింగ్ జరిగింది. ఎంపీలకు ఆకుపచ్చ(Green), ఎమ్మెల్యేలకు గులాబీ(Pink) రంగు బ్యాలెట్ పత్రాలు(Ballet Papers) ఇచ్చారు. 4809 మంది ఎలక్టరోరల్ కాలేజి(Electoral College) సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా కొందరు ఓటింగ్ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును ఉపయోగించుకోవాల్సి ఉండగా..కొందరు గైర్హాజరైనట్లు సమాచారం. పార్లమెంట్ హౌస్‌లోని రూమ్ నెంబర్ 63లో 6 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫు అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఎంపీలు ఆకుపచ్చ రంగు బ్యాలెట్ పత్రాల్లో, ఎమ్మెల్యేలు పింక్ రంగు బ్యాలెట్ పత్రాల్లో తమ ఓటు వేయనున్నారు. బీజేడీ, వైసీపీ, బీఎస్పీ, అన్నా డీఎంకే, టీడీపీ, జేడీ(ఎస్), శిరోమణి అకాలీదళ్, శివసేన, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు ఎన్డీయే అభ్యర్థికి మద్దతుగా ఉంటామని ప్రకటించాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లో (Presidential Elections 2022) విపక్షాల తరపున బరిలోకి దిగిన అభ్యర్థి యశ్వత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బులు ఎరగా వేశారని, ప్రలోభాలకు తెరలేపారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ విప్ లు పని చేయవని.... ప్రజా ప్రతినిధులు విచక్షణతో ఓటు వేయాలని కోరారు. రాష్ట్రపతి ఎన్నికల ఫలితం ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ప్రజాస్వామ్య విరుద్ధంగా కూల్చి వేశారని దుయ్యబట్టారు. తాను కేవలం రాజకీయ యుద్ధంలోనే కాకుండా, ప్రభుత్వ ఏజెన్సీలపై కూడా పోరాడుతున్నానని చెప్పారు. ప్రభుత్వ ఏజెన్సీలు చాలా శక్తిమంతంగా తయారయ్యాయని... అవి పార్టీలను కూడా చీల్చుతున్నాయని విమర్శించారు.