PK Meets KCR: కాంగ్రెస్‌లో చేరుతా కానీ, మీకోసం పనిచేస్తా! కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ ఆఫర్, రెండు రోజుల పాటూ సుదీర్ఘంగా ఇరువురి మధ్య చర్చలు
వీరిద్దరి భేటీలో అనేక అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ (CM KCR) ఆరా తీసినట్లు తెలుస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనే దానిపై ఆయనతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీని (BJP) గద్దెదించేందుకు అవసరమైన అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది.
Hyderabad, April 24: దేశరాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో (CM KCR) ఆయన సుధీర్ఘంగా చర్చలు జరిపారు. మరికొద్దిరోజుల్లో కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకుంటారని దేశమంతా ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గత రెండు రోజులుగా సీఎం కేసీఆర్‌తో పీకే (PK Meets KCR) చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్ తో ఆయన ఆదివారం లంచ్ చేశారు. వీరిద్దరి భేటీలో అనేక అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ (CM KCR) ఆరా తీసినట్లు తెలుస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనే దానిపై ఆయనతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీని (BJP) గద్దెదించేందుకు అవసరమైన అంశాలపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలు, బీజేపీ పరిస్థితిపై పీకే తో కేసీఆర్ మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా వీరి భేటీ కావడంతో రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
శనివారం రాత్రి ప్రగతిభవన్‌లోనే (Praghathi Bhvan) బసచేసిన పీకే.. ఆదివారం కూడా కేసీఆర్‌తో చర్చలు కొనసాగించారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌తో ఒప్పందం మేరకు పీకే రాష్ట్రంలో తమ బృందంతో కలిసి రాజకీయ, పాలన పరిస్థితులపై సర్వే (Survey) నిర్వహించారు. తొలుత 30 నియోజకవర్గాల్లోని సర్వే ఫలితాలను ఇచ్చారు. ఆ తర్వాత 89 నియోజకవర్గాల సర్వే జరిగింది. పీకే ఆ నివేదికను కేసీఆర్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆయన కాంగ్రెస్ నేతలతో జరిపిన సమావేశాల గురించి సైతం చర్చ జరిగినట్లు సమాచారం. ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు తాను టీఆర్‌ఎస్‌తో పనిచేస్తానని పీకే వెల్లడించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు చర్చలు కొనసాగించాలని కేసీఆర్ నిర్ణయించారు. రెండు, మూడు రోజుల్లో ఓ నిర్ణయాన్ని ప్రశాంత్ కిశోర్ ప్రకటించే అవకాశం ఉంది.
ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థకు (I PAC) సర్వేలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, జాతీయ రాజకీయాల్లో చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా వ్యూహరచన అంశాల్లో ఎంతో అనుభవం ఉంది. దీనికితోడు నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్, ఇతర పార్టీల పనితీరుపై విశ్లేషణలు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యూహ రచన, రాష్ట్రంలో వివిధ పార్టీలు చేసే విమర్శలను ఎలా తిప్పికొట్టాలన్న అంశాలపై ఐప్యాక్ శాస్త్రీయ సమాచారాన్ని, విశ్లేషణలను అందిస్తుందన్న ఉద్దేశంతో పీకేతో ఒప్పందానికి టీఆర్‌ఎస్ మొగ్గు చూపినట్టు తెలిసింది. ఒప్పందం తర్వాత ఐప్యాక్ బృందం నేరుగా టీఆర్‌ఎస్ యంత్రాంగంతో కలిసి పనిచేస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.