‘President’s Rule in Puducherry’: ముందుకురాని బీజేపీ, పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేసిన ఇన్‌చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఉత్తర్వులు రాగానే పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన
అయితే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ దాని మిత్ర పక్షాలు ఇప్పుడు అక్కడ అంతగా ఆసక్తి చూపడం లేదు.
Puducherry, February 24: పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ బల నిరూపణలో విఫలమైన నేపథ్యంలో సీఎం నారాయణ స్వామి రాజీనామాను సమర్పించిన సంగతి విదితమే. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ దాని మిత్ర పక్షాలు ఇప్పుడు అక్కడ అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన (‘President’s Rule in Puducherry) విధించాలంటూ ఇన్‌చార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కాంగ్రెస్ పతానంతరం కొత్తగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్ ( Puducherry L-G Tamilisai Soundararajan) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్.రంగస్వామి బీజేపీ అగ్రనేతలతో రహస్య చర్చలు జరిపి, ప్రభుత్వం ఏర్పాటుకు తాము సుముఖంగా లేమని తెలియజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్షం కూడా వెనక్కి తగ్గడంతో పుదుచ్చేరీలో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. 14 మంది సభ్యుల బలం వున్న ప్రతిపక్షం ప్రభుత్వ ఏ ర్పాటుకు నిరాకరించింది. గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు.కేంద్రం నుంచి ఉత్తర్వులు వెలువడగానే పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది.
సోమవారం రోజున వీ నారాయణస్వామి ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. 26 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మెజారిటీ నిరూపించలేకపోయింది. కాంగ్రెస్-డీఎంకే కూటమికి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం వల్ల నారాయణస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అయిదుగురు కాంగ్రెస్, ఒకరు డీఎంకే ఎమ్మెల్యే రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను వీడిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. బీజేపీలో చేరారు.
మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ విపక్షాలతో జతకూడి తమ ప్రభుత్వాన్ని కూల్చినట్లు నారాయణస్వామి ఆరోపించారు. కాగా బేడి మే 29, 2016 న లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని చేపట్టారు. వివిధ సమస్యలపై నారాయణసామితో గొడవ పడ్డారు. అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి మాజీ ఎల్-జి కిరణ్ బేడీ ప్రభుత్వ పనులను అరికట్టారని, ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతిపక్షాలతో కలిసి పనిచేశారని ఆరోపించారు.
"మా ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉండటంతో, మేము గత 5 సంవత్సరాలుగా కొనసాగుతున్నాం. మేము కోరిన నిధులను మంజూరు చేయకుండా కేంద్రం పుదుచ్చేరి ప్రజలకు ద్రోహం చేసింది ”అని నారాయణసామి అన్నారు. ఆయన మాట్లాడుతూ “మేము డిఎంకె మరియు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాము. ఆ తరువాత, మేము వివిధ ఎన్నికలను ఎదుర్కొన్నాము. మేము అన్ని ఉప ఎన్నికలలో గెలిచాము. పుదుచ్చేరి ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారని స్పష్టమైంది. ” అని తెలిపారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, ఆయన మంత్రివర్గం రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. రాజీనామాల ఆమోదం సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరితో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ త్వరలో నేడు రేపో విడుదల చేసే అవకాశం ఉంది.