Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బాధ్యతలు, పదవికి రాజీనామా చేసిన తీరత్ సింగ్ రావత్, ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున రాజీనామా నిర్ణయం
శనివారం సాయంత్రం ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్ మదన్ కౌశిక్ నేతృత్వంలో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ధామిని శాసన సభా పక్ష నేతగా (New Uttarakhand Chief Minister) ఎన్నుకున్నారు.
New Delhi, July 3: ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) బాధ్యతలు చేపట్టనున్నారు. శనివారం సాయంత్రం ఉత్తరాఖండ్ బిజెపి చీఫ్ మదన్ కౌశిక్ నేతృత్వంలో సమావేశమైన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ధామిని శాసన సభా పక్ష నేతగా (New Uttarakhand Chief Minister) ఎన్నుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో నూతన సీఎం ఎంపిక అనివార్యమైంది. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేనందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది మార్చి 10న తీరత్ సింగ్ ఉత్తరాఖండ్‌గా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాదు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం... ఆరు నెలల కాలంలో ఆయన శాసన సభ సభ్యునిగా ఎంపిక కావాల్సి ఉంది. అయితే, సెప్టెంబరు 5తో ఈ గడువు ముగియనుండటం, మరో 6 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉప ఎన్నికలు జరుపలేని పరిస్థితి తలెత్తింది. రాజ్యాంగపరమైన ఇబ్బందుల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం సూచన మేరకు తీరత్‌సింగ్ పదవి నుంచి వైదొలిగినట్లు సమాచారం.
బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ కేంద్ర పరిశీలకుడు నరేంద్ర సింగ్ తోమర్, రాష్ట్ర ఇంఛార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్ పాల్గొన్నారు. సమావేశానికి ముందు తీరత్ సింగ్ రావత్, రాష్ట్ర బిజెపి నాయకులతో కేంద్ర మంత్రి తోమర్ చర్చలు జరిపారు. సత్పాల్ మహారాజ్, ధన్ సింగ్ రావత్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ పుష్కర్ సింగ్ ధామికే వైపునకే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది.