'Deshbhakt' Stir: భారత పార్లమెంటు చరిత్రలో ఇదొక దుర్దినం, ఉగ్రవాది ప్రగ్యా మరో ఉగ్రవాది అయి నాతురాం గాడ్సేను దేశభక్తుడుగా సంబోధించారు: రాహుల్ గాంధీ
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా ఆదేశాల మేరకు ప్రగ్యాను రక్షణ శాఖపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ ప్యానెల్ నుంచి తొలగించారు.....
New Delhi, November 28: బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ ( Pragya Singh Thakur) పార్లమెంటులో నాథురామ్ గాడ్సే "దేశభక్తుడు" అంటూ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రదుమారం రేగుతుంది. అసలేం జరిగిందంటే, బుధవారం రోజు లోక్ సభలో ఎస్పీజీ (సవరణ) చట్టం బిల్లు చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా గాంధీజీని గాడ్సే ఎందుకు చంపాల్సి వచ్చిందని డీఎంకే ఎంపీ రాజా (DMK MP Raja) సభలో ప్రశ్నను లేవనెత్తారు. దీనికి ప్రగ్యా సింగ్ జోక్యం చేసుకొని "నాథురాం గాడ్సే దేశభక్తుడు, దేశ భక్తులకు ఉదాహరణలు ఇవ్వకండి" అంటూ వ్యాఖ్యానించింది.
ఈ వ్యాఖ్యల పట్ల గురువారం కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందిచారు. గాడ్సేను దేశభక్తుడు అని పిలిచిన ఆమె ఒక ఉగ్రవాది అన్నారు. ప్రగ్యా వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. "టెర్రరిస్ట్ ప్రగ్యా, మరో టెర్రరిస్ట్ గాడ్సేను దేశభక్తుడు" అని చెప్పింది. భారత పార్లమెంటు చరిత్రలో ఇదొక దుర్దినం అని రాహుల్ ట్వీట్ చేశారు.
Read Rahul Gandhi's Tweet Below:
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనసులోని మాటనే ప్రగ్యా బయటకు చెప్పారు. ఆమె వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
కాగా, ప్రగ్యా చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతిపక్ష నేతలే కాకుండా సొంత పార్టీ బీజేపీ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అయింది. లోకసభ స్పీకర్ ఓం బిర్లా కూడా ఆమె వ్యాఖ్యలను ఖండించారు. రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. గాడ్సే జనవరి 30, 1948 న 'జాతిపిత' మహాత్మా గాంధీని హత్య చేశారు.
ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సభలో గందరగోళానికి కారణమైన ప్రగ్యా సింగ్ ఠాకూర్ పై బీజేపీ వేటు వేసింది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా ఆదేశాల మేరకు ప్రగ్యాను రక్షణ శాఖపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ ప్యానెల్ నుంచి తొలగించారు. అంతేకాకుండా, ఈ సీజన్ పార్లమెంట్ సమావేశాలకు కూడా పూర్తిగా ఆమెను దూరంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఆమెపై పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా వేసింది. కొంతకాలం పాటు బీజేపీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.