SPG Bill Passed in Rajya Sabha: భద్రత అనేది స్టేటస్ సింబల్ కాదు! ఎస్పీజీ సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం, సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ పక్షాలు
మేము ఏ కుటుంబాన్ని టార్గెట్ చేయలేదు, దేశంలో 130 కోట్ల ప్రజలున్నారు, వాళ్లందరి భద్రత మా బాధ్యత అని అమిత్ షా అన్నారు....
New Delhi, December 3: స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్(SPG) సవరణ బిల్లు రాజ్యసభ (Rajya Sabha)లో మంగళవారం ఆమోదం పొందింది. ఈ సవరణ బిల్లు ఆమోదం కోసం సభలో ఓటింగ్ ప్రారంభించగా, ఇటీవల సోనియా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం తొలగించటం పట్ల కాంగ్రెస్ పార్టీ మరియు అనుకూల పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గాంధీ కుటుంబాని (Gandhi Family)కి ఎస్పీజీ రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది.
అయితే సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడుతూ ఎస్పీజీ సవరణ కేవలం గాంధీ కుటుంబం భద్రత కోసం మాత్రమే నిర్దేశించింది కాదు. మేము ఏ కుటుంబాన్ని టార్గెట్ చేయలేదు, దేశంలో 130 కోట్ల ప్రజలున్నారు, వాళ్లందరి భద్రత మా బాధ్యత అని అమిత్ షా అన్నారు. ఒక్క సోనియా గాంధీ కుటుంబానికే కాకుండా ఇతర మాజీ ప్రధానులకు కూడా ఎస్పీజీ తొలగించామనే దానిని గుర్తించాలని చెప్పారు. సమయం వచ్చినపుడు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తొలగించాల్సి రావొచ్చని అమిత్ షా పేర్కొన్నారు.
ఎస్పీజీ భద్రతను ఒక స్టేటస్ సింబల్ గా చూడరాదు. ఎస్పీజీ ఉండాల్సింది 'హెడ్ ఆఫ్ ద స్టేట్' (రాష్ట్రపతి) కి మాత్రమే అన్నారు. తాము ఏ కుటుంబానికి వ్యతిరేకం కాదని, అయితే వంశపారపర్యమైన రాజకీయాలకు వ్యతిరేకం అని అమిత్ షా సైటైర్ వేశారు.
సోనియా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ తొలగించినా, సీఆర్పీఎఫ్ బలగాలతో జడ్ ప్లస్ కేటగిరీ భద్రత అందిస్తున్నాం, ఇప్పటికీ వారు ఈ భూమి మీదనే అత్యధిక భద్రతను కలిగి ఉన్నారని అమిత్ షా తెలిపారు.
ఇక, ఈ అంశంపై చర్చ ముగిసిన అనంతరం ఎస్పీజీ సవరణ బిల్లు మూజువాణి ఓటుతో రాజ్యసభలో ఆమోదం పొందింది.