Sonia Gandhi Security Downgraded: సోనియా గాంధీ కుటుంబానికి భద్రత తగ్గింపు, ఎస్పీజీ భద్రతను తొలగించిన కేంద్ర ప్రభుత్వం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు, గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపణ
Congress Interim President Sonia Gandhi And Rahul Gandhi (Photo Credits: PTI)

New Delhi, November 8: సోనియా గాంధీ (Sonia Gandhi) కుటుంబ సభ్యులకు ప్రత్యేక భద్రతా బృందం (SPG - Specail Protection Group) సెక్యూరిటీని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీ సహా, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీలకు ఇకపై CRPF కేటగిరీలో "Z +" భద్రత మాత్రమే కొనసాగించనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. గాంధీ కుటుంబానికి అవసరమయ్యే భద్రతను అంచనా వేసి, ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాతనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

అప్పట్లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత వారి కుటుంబానికి భద్రతను పెంచుతూ 1985 నుంచే ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజి) ను అమలులోకి తీసుకొచ్చారు.

ఎస్పీజి బృందంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మరియు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ల నుండి దాదాపు 3000 మంది సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తారు. ప్రధానమంత్రి, మాజీ ప్రధాన మంత్రులు, వారి కుటుంబ సభ్యులకు మరియు చాలా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు మాత్రమే ఈ ఎస్పీజీ భద్రత లభిస్తుంది. అయితే, తాజాగా నాయకుల భద్రతపై సమీక్ష నిర్వహించిన కేంద్రం, సోనియా గాంధీ కుటుంబానికి అంతటి సెక్యూరిటీ అవసరం లేదని భావించి వారి భద్రతను జడ్ ప్లస్ కేటగిరికు కుదించింది.

కాగా, కేంద్రం నిర్ణయంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోనియా గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేత నానాభావు ఫల్గున్‌రావ్ పటోల్ ఆరోపించారు. వారి కుటుంబానికి గల ముప్పు గురించి అందరికీ తెలుసునని, బీజేపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే భద్రతను కుదించారని మండిపడ్డారు. ఆ కుటుంబానికి ఎప్పట్లాగే ఎస్పీజీ భద్రతా కొనసాగించాలని నానాభావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గత ఆగష్టు నెలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా SPG భద్రత నుంచి కేంద్రం మినహాయింపునిచ్చింది. ప్రస్తుతం ఆయనకు 50 మందికి పైగా సాయుధ CRPF కమాండోలతో "Z ప్లస్" భద్రత లభిస్తుంది. ఇక నుంచి సోనియా గాంధీ కుటుంబానికి కూడా ఇదే కేటగిరీలో భద్రత లభించనున్నట్లు సమాచారం.

ప్రధాని పదవి నుంచి మన్మోహన్ సింగ్ దిగిపోయిన తర్వాత ఆయన కుమార్తెలు 2014 లోనే ఈ ఎస్పీజీ భద్రతను స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి యొక్క దత్త కుమార్తె కూడా స్వచ్ఛందంగా ఎస్పీజీ భద్రతను వదులుకుంది. దేశంలో చాలా మంది ప్రధానులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రను కుదించుతూ వచ్చింది. మన్మోహన్ సింగ్ కంటే ముందు మాజీ ప్రధానులైన హెచ్‌డి దేవేగౌడ, విపి సింగ్‌లకు కూడా ఈ ఎస్పీజీ భద్రత నుంచి మోదీ ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఒక్క వాజ్‌పేయికి మాత్రమే ఆయన చనిపోయేంతవరకు ఎస్పీజీ భద్రత కొనసాగింది.