Shiv Sena Symbol Row: శివసేన సింబల్ వివాదం, షిండే వర్గానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, ఈసీ ఆదేశాలపై స్టేకు నిరాకరించిన అత్యున్నత ధర్మాసనం

ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్‌ ఠాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఈ అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది.

Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

Mumbai, Feb 22: శివసేన పార్టీ పేరు, గుర్తును (Shiv Sena Symbol Row) ప్రస్తుత మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde)వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కేటాయించిన సంగతి విదితమే. ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఉద్దవ్‌ ఠాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఈ అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ పార్దివాలా నేతృత్వంలోని బెంచ్‌ పిటిషన్ విచారణకు స్వీకరించింది. షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఠాక్రే వర్గం కోర్టును కోరింది.

అయితే కోర్టు మాత్రం ఠాక్రే వర్గ పిటిషన్‌కు కౌంటర్‌ దాఖలు చేయాలంటూ షిండే క్యాంప్‌కు నోటీసులు జారీ చేసింది. ఇక పార్టీ పేరు, గుర్తును ఒక వర్గానికి కేటాయించిన ఈసీ ఆదేశాలపై స్టే విధించాలని ఠాక్రే వర్గం సుప్రీంను అభ్యర్థించగా.. అందుకు మాత్రం సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది.

ఈ విషయంలో ఏదో నిర్ణయం తీసుకునే వరకు యధాస్థితిని కొనసాగించాలని ఉద్ధవ్‌ వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. తమకు రక్షణ కావాలని, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకోవడం ఇష్టం లేదన్నారు. శివసేన పార్లమెంటరీ కార్యాలయాన్ని మంగళవారం స్వాధీనం చేసుకున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మా నుంచి అన్నీ దొంగిలించినా ఠాక్రే పేరును మాత్రం దొంగిలించలేరు, మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి ఆపకపోతే ఇవే చివరి ఎన్నికలంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఉద్ధవ్ థాకరే

ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈసీ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా లేని ఏదైనా చర్య తీసుకుంటే గనుక.. చట్టానికి సంబంధించిన ఇతర పరిష్కారాలను అనుసరించవచ్చని సుప్రీం కోర్టు థాక్రే శిబిరానికి సూచించింది.

శివసేన పార్టీపేరు, గుర్తు కోసం రూ. 2వేల కోట్ల డీల్, సంచలన విషయాలు బయటపెట్టిన ఉద్దవ్ వర్గం ఎంపీ, ఈవీఎం ట్యాంపరింగ్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడి

శివసేన ఉద్దవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే పేరుతో పార్టీ పేరును.. వెలుగుతున్న టార్చ్‌ సింబల్‌ను గుర్తుగా ఉపయోగించుకోవచ్చన్న ఈసీ నిర్ణయాన్ని చీఫ్‌ జస్టిస్‌ ఈ సందర్భంగా పిటిషనర్‌కు సూచించారు. ఆపై విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.