Mumbai, FEB 19: శివసేన(Shiv Sena) పేరు, పార్టీ ఎన్నికల గుర్తు ‘విల్లు- బాణం’.. మహారాష్ట్ర(Maharashtra) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే(Eknath Shinde) వర్గానికి చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(EC) స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్(Sanjay Raut) సంచలన ఆరోపణలు చేశారు. శివసేన పార్టీ పేరు, గుర్తు 'విల్లు- బాణం' కొనుగోలు చేసేందుకు రూ.2000 కోట్ల ఒప్పందం(Deal) జరిగిందని ఆరోపించారు. రూ.2 వేల కోట్లు ప్రాథమిక అంచనా మాత్రమేనన్నారు. ఈ సమాచారం వంద శాతం నిజమని, త్వరలో మరిన్ని విషయాలు బయటకు వస్తాయంటూ సంజయ్ రౌత్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో ఆరు నెలలుగా లావాదేవీలు సాగుతున్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలను త్వరలో ప్రవేశపెడతానన్నారు. ఇప్పటివరకు రూ.2000 కోట్లు చేతులు మారాయని, ఇది తక్కువ మొత్తం కాదని తెలిపారు. దేశ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. అయితే, శిందే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సదా సర్వాంకర్.. ఈ ఆరోపణలను ఖండించారు. అలా చెప్పడానికి సంజయ్ రౌత్ ఏమన్న క్యాషియరా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.
#WATCH शिवसेना और उसका निशान (तीर-कमान) चिह्न छीना गया है और ऐसा करने के लिए इस मामले में अब तक 2,000 करोड़ रुपए की लेनदेन हुई है: उद्धव ठाकरे गुट के नेता व सांसद संजय राउत, मुंबई pic.twitter.com/6hyQHLjMZr
— ANI_HindiNews (@AHindinews) February 19, 2023
సీఎం పదవి కోసం ఉద్ధవ్ ఠాక్రే.. తన పార్టీకి విరుద్ధమైన భావజాలం కలిగిన కాంగ్రెస్, ఎన్సీపీల కాళ్లపై పడ్డారని అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపైనా రౌత్ స్పందించారు. ‘ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ శిందే ఏం చేస్తున్నారు? అమిత్ షా వ్యాఖ్యలను మహారాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదు’ అని అన్నారు. ఉద్ధవ్ సైతం.. ఏక్‌నాథ్ వర్గంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. శివసేన ఎన్నికల గుర్తు ‘విల్లు- బాణం’ను చోరీ చేశారని ఇప్పటికే ఆయన మండిపడ్డారు. మరోవైపు.. ఈ వ్యవహారంలో తన వెనుక రాయిలా నిలబడతానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటిచ్చారని.. దాన్ని ఆయన నిలబెట్టుకున్నారని ఏక్‌నాథ్ శిందే అన్నారు.