Tamil Nadu Assembly Election Results 2021: పదేళ్ల తరువాత ఉదయించిన సూర్యుడు, తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా స్టాలిన్.., ప్రభావం చూపని అధికార పార్టీ అన్నాడీఎంకే, భారీ ఓటమిని మూటగట్టుకున్న కమల్ పార్టీ

తమిళనాడులో సూర్యుడు ఉదయించాడు, అధికార పార్టీ అన్నా డీఎంకే-బీజేపీ కూటమిని చిత్తు చేస్తూ స్టాలిన్ అధ్వర్యంలోని డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఘన విజయం (Tamil Nadu Assembly Election Results 2021) సాధించింది. మళ్లీ అధికారంలోకి రావాలనుకున్న అన్నాడీఎంకే ఆశలు చిత్తు చేస్తూ స్టాలిన్ (MK Stalin) ఏకపక్ష విజయాన్ని సాధించాడు

DMK chief M.K. Stalin (Photo-PTI)

Chennai, May 3: తమిళనాడులో సూర్యుడు ఉదయించాడు, అధికార పార్టీ అన్నా డీఎంకే-బీజేపీ కూటమిని చిత్తు చేస్తూ స్టాలిన్ అధ్వర్యంలోని డీఎంకే-కాంగ్రెస్ కూటమి ఘన విజయం (Tamil Nadu Assembly Election Results 2021) సాధించింది. మళ్లీ అధికారంలోకి రావాలనుకున్న అన్నాడీఎంకే ఆశలు చిత్తు చేస్తూ స్టాలిన్ (MK Stalin) ఏకపక్ష విజయాన్ని సాధించాడు. ఈ అసెబ్లీ ఎన్నికల్లో ( Tamil Nadu Assembly Election) మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 156 స్థానాలను (ఆధిక్యతతో కలిపి) కైవసం చేసుకుంది. అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు(ఆధిక్యంతో కలుపుకుని) లభించాయి.

పార్టీల వారీగా డీఎంకే 131, కాంగ్రెస్‌ 17, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 4 స్థానాల్లో విజయం ( After 10 Years As DMK-Led Alliance Coasts Towards Emphatic Victory) సాధించాయి. ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే 70, పీఎంకే 4, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. డీఎంకే కూటమి 46.21% ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే కూటమి 40.14% ఓట్లు సాధించింది. (అధికారికంగా ప్రకటించిన తరువాత ఈ లెక్కలు అటూ ఇటూ అయ్యే అవకాశం ఉంది)

ఈసారి డీఎంకే సొంతంగా 173 స్థానాల్లో పోటీ చేసింది. ఆ కూటమిలోని కాంగ్రెస్‌కు 25 స్థానాలు కేటాయించారు. సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఎండీఎంకే తలా ఆరు చోట్ల, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ 3, కొంగునా డు మక్కల్‌ దేశీయ కట్చి 3, మణిదనేయ మక్కల్‌ కట్చి 2, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, తమిళగ వాళ్వురిమై కట్చి, మక్కల్‌ విడుదలై కట్చి, ఆత్తి తమిళర్‌ పేరవై ఒక్కోచోటి నుంచి పోటీ చేశాయి. ఇందులో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, డీపీఐ, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ మినహా మిగిలిన పార్టీలన్నీ డీఎంకే చిహ్నం ఉదయించే సూర్యుడి గుర్తుపైనే పోటీ చేశాయి. అంటే సాంకేతికంగా డీఎంకే 190 స్థానాల్లో పోటీ చేసినట్లయింది. ఇక.. అన్నా డీఎంకే సొంతంగా 179 స్థానాల్లో పోటీ చేసింది. ఆ కూటమిలోని పీఎంకే 23, బీజేపీ 20 స్థానాల్లో బరిలో నిలిచాయి.

తిరుపతిలో 2019 రికార్డు బ్రేక్, 2 లక్షల 70 వేల 584 ఓట్ల మెజార్టీతో గెలిచిన వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, ఫ్యాన్ ధాటికి రెండు, మూడు స్థానాలకే పరిమితం టీడీపీ, బీజేపీ-జనసేన

తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గత దశాబ్ద కాలంగా డీఎంకే అధికారంలో లేదు. ఈ ఎన్నికల్లో ఘన విజయం అందించిన తమిళనాడు ప్రజలకు డీఎంకే చీఫ్, కాబోయే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో డీఎంకే ఆరోసారి అధికారంలోకి రానుందన్నారు. డీఎంకే పాలనలోనే సంక్షేమం సాధ్యమని ప్రజలు విశ్వసించారని వ్యాఖ్యానించారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రతీక్షణం పాటుపడుతానన్నారు. గతంలో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో స్టాలిన్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు, తమిళనాడులో ఘనవిజయం సాధించిన డీఎంకేకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. అలాగే, ఎన్డీయేకు ఓటేసిన తమిళ ప్రజలకు, కూటమి విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

సాగర్‌లో గులాబీ రెపరెపలు, నోముల భగత్ విజయం, రెండో స్థానంలో జానారెడ్డి, గల్లంతయిన బీజేపీ, రౌండ్ల వారీగా ఫలితాలు ఇవే

డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల దిగ్గజ నాయకులు, దశాబ్దాలుగా తమిళ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కరుణానిధి, జయలలిత లేకుండానే ఈ ఎన్నికలు జరిగాయి. కరుణానిధి 2018లో, జయలలిత 2016లో మరణించిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ పార్టీ ‘మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం)’ కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. స్వయంగా కమల్‌హాసన్‌ కోయంబత్తూర్‌ సౌత్‌ స్థానంలో ఓటమి పాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్‌ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.

ముఖ్యమంత్రి పళనిసామి సేలం జిల్లాలోని ఎడప్పాడి నుంచి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బోదినాయకనూర్‌ నుంచి, డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ కోలత్తూర్‌ స్థానం నుంచి విజయం సాధించారు. స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ చెపాక్‌– ట్రిప్లికేన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. డీఎంకే ఘనవిజయంతో పార్టీ శ్రేణులు, కోవిడ్‌ నిబంధనలను పట్టించుకోకుండా, సంబరాల్లో మునిగితేలాయి.‘స్టాలిన్‌ థాన్‌ వారారు(స్టాలిన్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారు)’ అనే డీఎంకే ప్రచార గీతం హోరెత్తింది. డీఎంకే విజయం సాధించిన 2006లో డీఎంకే 96, డీఎంకే మిత్ర పక్షం కాంగ్రెస్‌ 34, అన్నాడీఎంకే 61 సీట్లు గెలుచుకున్నాయి. 2011, 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది.

స్టాలిన్‌ రాజకీయ ప్రస్థానం

స్టాలిన్‌ 1984లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. చెన్నైలోని థౌజండ్‌లైట్స్‌ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి కేఏ కృష్ణస్వామి చేతిలో ఓడిపోయారు. 1989లో మళ్లీ అదే స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. అక్కడ 6 సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు. 2011లో కొళత్తూరు నుంచి పోటీచేసి గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా కొళత్తూరు నుంచే బరిలో దిగి విజయం సాధించారు. స్టాలిన్‌ 1996లో థౌజండ్‌ లైట్స్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చెన్నై మేయర్‌ స్థానానికి పోటీచేసి గెలిచారు. ఇలా రెండు ఎన్నికైన పదవుల్లో ఏకకాలంలో పనిచేశారు. 2001లో కూడా చెన్నై మేయర్‌గా మళ్లీ గెలిచారు. అయితే 2002లో అప్పటి సీఎం జయలలిత.. ఒకే వ్యక్తి రెండు ఎన్నికైన పదవుల్లో ఉండకుండా చట్టం తీసుకొచ్చారు.

తండ్రి కరుణానిధి (సినీ రచయితగా) సినీరంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి.. స్టాలిన్‌కు కూడా ఆ రంగంలో ప్రవేశం ఉంది. పాతికేళ్ల వయస్సులోనే 1978లో నంబిక్కై నట్చత్రం అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఒరేరత్తమ్‌, మక్కల్‌ అనయట్టల్‌ చిత్రాలతో పాటు కురుంజి మలార్‌, సూరియా టీవీ సిరీస్‌ల్లో నటించారు. తమ కూటమిలోని కాంగ్రెస్‌ వంటి మిత్రపక్షాలకు సీట్ల పంపిణీ విషయంలో కూడా స్టాలిన్‌ చాలా పట్టుదలతో వ్యవహరించడం కలిసొచ్చింది. డీఎంకే బలంగా ఉన్న నియోజకవర్గాలను మిత్రపక్షాలకు ఇవ్వడానికి స్టాలిన్‌ ససేమిరా అన్నారు. అలా మొత్తం 234 సీట్లున్న అసెంబ్లీలో డీఎంకే 173 సీట్లలో పోటీచేయగా.. మిగిలిన 61 సీట్లను 12 మిత్రపక్షాలకు వదిలేశారు. అదే స్టాలిన్‌కు గెలుపు అశ్వంగా మారింది.

ఏ మాత్రం ప్రభావం చూపని కమల్ పార్టీ

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ఎంఎన్‌ఎం.. శరత్‌కుమార్‌ పార్టీ ‘ఆలిండియా సమతువ మక్కల్‌ కట్చి’తో పొత్తు కుదుర్చుకుంది. ఈ రెండు పార్టీలు చెరో 40 స్థానాల్లో పోటీ చేశాయి. దక్షిణ కోయంబత్తూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్‌ ఓటమిని చవిచూశారు. మిగతా స్థానాల్లో కూడా కమల్‌ కూటమి ఎంతమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now