Tirupati, May 2: తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైయస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ నుంచి బరిలో నిలిచిన గురుమూర్తి (YCP Candidate Gurumurthy) సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపై 2 లక్షల 70 వేల 584 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా 2019లో అధికార వైసీపీ అభ్యర్థి 2.28 లక్షల ఓట్ల మెజార్టీని సాధించగా ఈ ఉప ఎన్నికలో (Tirupati By Elections Results 2021) అది క్రాస్ అయింది.
తాజా సమాచారం ప్రకారం వైసీపీకి 6,23,774 ఓట్లు పోలవగా, తెలుగు దేశం పార్టీకి 3,53,190 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 56,280 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 9,549 ఓట్లు పోలయ్యాయి. ఫ్యాన్ ధాటికి టీడీపీ, బీజేపీ-జనసేన రెండు, మూడు స్థానాలకే పరిమితం అయ్యాయి.
తిరుపతి అర్బన్ తో పాటు శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ హవా చాటింది. ఈ స్థాయిలో మెజారిటీ రావడంపై గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన, సీఎం వైఎస్ జగన్ ఛరిష్మా రెండు కళ్లుగా ఈ గెలుపుకు దోహదపడ్డాయని ఆయన అన్నారు. ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని.. ప్రజల్లో ఇతర పార్టీల పరిస్థితి ఏంటనేది వారికొచ్చిన ఓట్లను బట్టే తెలుస్తోందన్నారు.
ఇదిలా ఉంటే విజయోత్సవ సంబరాలు నిర్వహించొద్దని పార్టీ శ్రేణులను వైఎస్సార్‌సీపీ ఆదేశించింది. కోవిడ్ నిబంధనలు, ఈసీ సూచనల మేరకు సంబరాలు చేయొద్దని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీకే తిరుపతి ప్రజలు పట్టి.. టీడీపీ కుట్రలను తిప్పికొట్టారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతిలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఊహించినదేనన్నారు.
ఓటమి భయంతోనే చంద్రబాబు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు తిరుపతి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కాగా, తిరుపతి ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రభుత్వం వెంటే తామున్నామని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది.