Telangana: పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం, తీర్మానానికి బీజేపీ మినహా అన్ని పార్టీల మద్ధతు, తీర్మానం ప్రతులను చించేసిన బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్

సిఎఎకు వ్యతిరేకంగా ఇప్పటివరకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం చేసిన రాష్ట్రాల జాబితాలో కేరళ, పంజాబ్, దిల్లీ, బీహార్, ఛత్తీస్‌ఘడ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తర్వాత తెలంగాణ చేరింది.

Telangana Assembly | Photo: Wikimedia Commons

Hyderabad, March 16: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా (తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) తీర్మానాన్ని  Anti CAA Resolution)  ఆమోదించింది. సిఎఎకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. తాము ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందో ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో వివరించారు. అనంతరం ఈ అంశంపై సభలో చర్చ జరిగింది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సిఎఎ పట్ల తమ అభిప్రాయాలను తెలిపారు.

సిఎఎ ముస్లింలకు వ్యతిరేకంగా ఉంది. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ వలన మైనార్టీలు, దళిత గిరిజన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఇవి కొత్త చిక్కులను సృష్టిస్తాయని తెలపగా, సభలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తీర్మానానికి సంబంధించిన ప్రతులను చించివేశారు.

తెలంగాణ అసెంబ్లీలో సిఎఎ వ్యతిరేక తీర్మానానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ మరియు ఎంఐఎం పార్టీలు మద్ధతు పలికగా, బీజేపీ వ్యతిరేకించింది. అనంతరం తీర్మానం ఆమోదించబడినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు.

దీంతో దేశంలో సిఎఎకు వ్యతిరేకంగా ఇప్పటివరకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం చేసిన రాష్ట్రాల జాబితాలో  కేరళ, పంజాబ్, దిల్లీ, బీహార్, ఛత్తీస్‌ఘడ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తర్వాత తెలంగాణ చేరింది.

అంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ స్పష్టమైన అవగాహనతోనే సిఎఎ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సీఎం స్పష్టం చేశారు.సిఎఎకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వందల సంవత్సరాలుగా విభిన్నమైన సంస్కృతి ఉన్న దేశంలో, మన వైఖరి ఏంటనేది తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకునే దేశంలో ఇలాంటి చట్టాలు దేశ ప్రతిష్ఠను దిగజారుస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. సిఎఎపై కేంద్రం పున: సమీక్షించుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు.