Telangana Udyamam 2.0: మరో తెలంగాణ ఉద్యమంలా టీఎస్ ఆర్టీసీ సమ్మె, చలించేది లేదన్న సీఎం కేసీఆర్, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? తాజా పరిణామాలపై ఒక విశ్లేషణ

అందుకు తగినట్లుగానే సమ్మెకు కౌంటర్ గా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది....

TSRTC indefinite strike in Telangana| (File Photo)

Hyderabad, October 13: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె (TSRTC Strike)తో ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థం అయింది. ప్రైవేట్ సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మీద పరిమిత సంఖ్యలో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి, హైదరాబాద్ నగరంలో అయితే సిటీ బస్సులు ఎక్కడో ఒకచోట చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ డిమాండ్ కు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు, దీంతో ప్రజలు కూడా పూర్తిగా ఆర్టీసీపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమదారి తాము చూసుకుంటున్నారు.

ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు ఏకమవడంతో సమ్మె ఉద్యమరూపం తీసుకుంటుంది. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ప్రకటించేశారు. 'మరో తెలంగాణ ఉద్యమం'ని తలపించేలా అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 19 వరకు వివిధ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యా చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏపిలోని కృష్ణా జిల్లా, కన్నెపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే టీఎస్ ఆర్టీసీ డ్రైవర్ ఒంటికి నిప్పంటిచుకోవడంతో ఆయన శరీరం 80 శాతం వరకు కాలింది, దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్, సంతోష్ నగర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు.  మరో ఆర్టీసి కార్మికుడు కూడా ఇదే తరహాలో ఆత్మహత్యాయత్నం చేయగా ఆయనను తోటి కార్మికులు, పోలీసులు అడ్డుకున్నారు.

ఇంతకీ ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక కేసీఆర్ పని అయిపోయినట్లేనా? ఒకసారి విశ్లేషించుకుందాం.

రాష్ట్రంలో 'అమాయకమైన శత్రుత్వం' కొనసాగుతుంది: సీఎం కేసీఆర్

ఇటు తెలంగాణ ఆర్టీసీ నాయకులు బెట్టు వీడటం లేదు, అటు ప్రభుత్వం కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పోలీసు శాఖ డ్రైవర్లు, రిటైర్డ్ ఆర్టీసీ సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందిని తీసుకొని 3 రోజుల్లో వందశాతం బస్సులు నడిచేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ యూనియన్ లీడర్లపై మరియు ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదసలు సమ్మెనే కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కొంతమంది నాటకాలు చేస్తున్నారని కేసీఆర్ విరుచుకుపడ్డారు, లీడర్ల మాటలు నమ్మి కార్మికులు బలయ్యారు, ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తూ, ఆర్టీసీని మరింత నష్టపరిచే వారిని క్షమించేది లేదు, వారి ఉద్యమానికి చలించేది లేదు అంటూ కేసీఆర్ తేల్చిచెప్పారు.

అర్థరహిత డిమాండ్లతో, చట్ట విరుద్ధంగా కార్మికులు చేస్తున్న సమ్మెకు రాష్ట్రంలో కొన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇవ్వడం అనైతికం. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, న్యాయ సమ్మతం కాని కోర్కెలతో సమ్మె చేసే వారికి మద్దతిచ్చే రాజకీయ పక్షాలకు ప్రజల మద్దతు లేదు. అసలు రాష్ట్రంలో సరైన ప్రతిపక్షమే లేదు. రాష్ట్రంలో పరిస్థితి నాదాన్ దుష్మన్ (అమాయకమైన వెర్రి శత్రుత్వం) అనే విధంగా ఉంది. రాజకీయ ప్రయోజనం కోసం గోతికాడి నక్కల్లా ఎదురు చూస్తున్నాయి. వారి ఆశ ఫలించదు. సమ్మెకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రజల నుంచి చీత్కారం తప్పదు. గతంలో అనేక విషయాల్లో తప్పుడు వైఖరి అవలంభించడం వల్లే వారు ప్రజల మద్దతు కోల్పోయారు. ఆర్టీసీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లలో వేటిని కూడా ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు. ప్రజలు ఈ విషయాన్ని గమిస్తున్నారు.

అని సీఎం కేసీఆర్ అన్నారు.

దీనిని బట్టి చూస్తే గతంలో స్వయానా ఉద్యమ నాయకుడైన నేటి సీఎం కేసీఆర్ ఈ సమ్మెను ఒక రాజకీయ అంశంగానే పరిగణిస్తున్నారు తప్ప, ప్రజాఉద్యమంలా దీనిని భావించడం లేదు. అందుకు తగినట్లుగానే సమ్మెకు కౌంటర్ గా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఇతర ఉద్యోగ సంఘాలు తమకు, ఈ సమ్మెతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి. అయితే సీఎంతో ఆర్టీసీ సమస్యలపై చర్చిస్తామని, రాజకీయ నాయకుల ట్రాప్ లో పడకూడదని ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు కారెం శివాజీ పేర్కొన్నారు.

ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ సమ్మె పట్ల ప్రజల మద్ధతు ప్రభుత్వానికా లేక ఆర్టీసీ కార్మికులకా?

వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించినపుడు మెజారిటీ ప్రజలు ఈ సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు తప్ప, ఎవరు ప్రభుత్వాన్ని బలంగా వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే ఈ సమ్మె వల్ల ఇబ్బందులు పడేది సామాన్య ప్రజలే. అందుకు బాధ్యులు మళ్లీ ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వమే అవుతారు, ప్రభుత్వం ప్రత్యమ్నాయ ఏర్పాట్లతో గట్టి ప్రయత్నం చేస్తుండంతో ఈ విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత కొంతవరకు తగ్గించుకోగలుగుతుంది.

అలాగే, ఇదేమి ఆనాడు  స్వరాష్ట్రం కోసం జరిగిన పోరాటమో లేదా ప్రజా హక్కుల కోసమో జరిగే పోరాటం కాదు, కేవలం ఆర్టీసీ కార్మికులు వారి ప్రయోజనాల కోసం 'రాజకీయ పక్షాలతో' కలిసి చేస్తున్న పోరాటం. ఇందుకోసం ప్రజలంతా ఇప్పుటికిప్పుడు ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతారనుకోవడం అర్ధరహితం.

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా సందర్భాల్లో ప్రయాణికుల పట్ల ఆర్టీసీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఏదైనా సమస్య లేదా సేవల అంతరాయం పట్ల ఆర్టీసీ నుంచి జవాబుదారీతనం సరిగ్గా ఉండదు. ఇదే సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ సిబ్బంది ప్రయాణికుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తారు, వారి నుంచి సమస్యకు జవాబు కూడా చాలా తొందరగా లభిస్తుంది. ఇలాంటి విషయాలు ప్రజల మనసుల్లో  ఉండిపోతాయి, అవి వారిని ఇలాంటి సమ్మె సందర్భాల్లో ఆర్టీసీ కార్మికులకు మద్ధతిచ్చేందుకు వెనకడుగు వేసేలా చేస్తాయి.

అలా అని ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదని కాదు, ప్రతీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంటుంది, సీఎం కేసీఆర్ కొన్ని విధానాల పట్ల ఉద్యోగుల్లో, విద్యార్థులు- నిరుద్యోగుల్లో, కొన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అది ఆయా సందర్భాన్ని బట్టి వ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా అని, ఒక రాజకీయ నాయకుడు ఆలోచించేలా ప్రజలు ఆలోచించరు. ప్రస్తుతానికి ఈ ప్రభుత్వానికి మరో నాలుగేళ్ల పాటు ఎలాంటి ఢోకా లేదు. అయితే స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఇంతటి భారీ సమ్మె చోటు చేసుకోవడం ప్రభుత్వానికి  మైనస్ అనే చెప్పాలి.

మంత్రులు కూడా   ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కార్మికుల్లో తీవ్ర ఆందోళన ఉన్న నేపథ్యంలో వారిని మరింత భయభ్రాంతులకు గురిచేయకుండా, భేషజాలను పక్కనపెట్టి సమస్య పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

అఖిల పక్షానికి ప్రజా మద్ధతు ఉందా?

తెలంగాణలో సీఎం కేసీఆర్ ను ఎదురించేంత దీటైన, సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో రాష్ట్రంలో ప్రతిపక్షం చచ్చుబడిపోయింది. అయితే ఇప్పుడు టీఎస్ ఆర్టీసీ సమ్మెతో అంపశయ్యపై పడుకున్న ప్రతిపక్షానికి ఆక్సిజన్ లభించినట్లయింది. అయితే ఇంతటి అవకాశం వచ్చినా ప్రతిపక్షాల బలహీనత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే సీఎం కేసీఆర్ వీరిని లైట్ తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఇక్కడ సమ్మె కొనసాగుతుండగా 'గల్ఫ్ టూర్' పేరుతో సమ్మెను సైడ్ ట్రాక్ చేస్తున్నారు.

అఖిల పక్షం చేరికతో టీఎస్ ఆర్టీసీ సమ్మె పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ పక్షాలు ఆర్టీసీ కార్మికులను రెచ్చగొడుతూ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా చిత్రీకరించేదుకు పోటీపడుతున్నాయి తప్ప సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేపట్టడం లేదు. ఇందులో వారివారి పొలిటికల్ మైలేజీ వారు చూసుకుంటున్నారు.

ఆర్టీసీ డిమాండ్లు నెరవేరాలంటే అది ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. అది జరగాలంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరగాలి. తాజా పరిణామాలతో ఇప్పటికే ప్రభుత్వానికి - ఆర్టీసీ కార్మికులకు మధ్య దూరం పెరిగిపోయింది, ఈ సమయంలో ఏదైనా రాజకీయ పక్షం పెద్దన్న పాత్ర పోషించి ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయకుండా, కేసీఆర్ ఎలా చేయరో చూస్తాం అనేలా హెచ్చరికలు చేయడం ద్వారా ఎలాంటి లాభం ఉండదు. ఒకవేళ వీరి ఒత్తిడికి తలొంచి ప్రభుత్వం దిగివచ్చి కార్మికులకు హామి ఇచ్చినా, భవిష్యత్తులో ఈ కార్మికులంతా మళ్లీ కొన్నాళ్ల పాటు ఇదే ప్రభుత్వంలో పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడు కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావా?  అన్నది మరో ప్రశ్న.

ఒకప్పుడు ఉద్యమాన్ని నడిపించిన కేసీఆర్ ఇలాంటివి ఎన్నో చూశారు, ఇప్పుడు పవర్ తన చేతిలోనే ఉంది, ఇప్పటికిప్పుడు యూనియన్ లీడర్లను పక్కన పెట్టేసి ఆర్టీసి కార్మికులందరికీ వారు కోరుకునేవిధంగా లేదా అంతకంటే ఎక్కువ ఇచ్చి ఇప్పుడు తిట్టించుకున్న నోళ్లతోనే 'కేసీఆర్ దేవుడు' అని పాలభిషేకాలు చేయించుకోగల సమర్థుడు ఆయన, అలాంటి పరిస్థితి వస్తే ఈ రాజకీయ పక్షాలు ఇప్పుడు కోరుకుంటున క్రెడిట్ అంతా మళ్ళీ కేసీఆర్ కే వెళ్తుంది. ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు, చర్చించుకుంటున్నారు,  జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. కాబట్టి సమ్మె రాజకీయం అవ్వకుండా సమస్యకు సామరస్యపూర్వకమైన వాతావరణంలో సరైన పరిష్కారం దొరికితే అది కార్మికులకు, ప్రజలకు మంచిది.