Telangana Bandh: ఈ నెల 19న తెలంగాణ బంద్, తీవ్రరూపం దాల్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె,  ధూం ధాం, వంటావార్పు, రాస్తారోకోలతో అట్టుడికిపోనున్న తెలంగాణ రాష్ట్రం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైన ప్రభుత్వం
rtc-jac-gives-telangana-bandh-call-on-october-19 (Photo-PTI)

Hyderabad,October 12: తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె తీవ్రరూపు దాల్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు ఇతర డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు పట్టు వీడేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ధూం ధాం, వంటావార్పు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్‌లు, బహిరంగ సభలతో తెలంగాణ రాష్ట్రం మరోసారి మార్మోగనుంది. వారం రోజులుగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న ర్యాలీలు, 17న ధూంధాం, 18న బైక్ ర్యాలీలు చేపట్టాలని నిశ్చయించారు. అంతేకాకుండా, ఈ నెల 19న తెలంగాణ బంద్ కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. శనివారం (అక్టోబర్ 12) విపక్ష పార్టీలతో మరోసారి భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ నాయకులు అనంతరం సమ్మె షెడ్యూల్ ప్రకటించారు.

ఆర్టీసీ జేఏసీ కార్యాచరణ ఇదే..

13న వంటావార్పు

14న ఆర్టీసీ డిపోల ముందు బైఠాయింపు, ఇందిరా పార్క్ వద్ద బహిరంగసభ

15న రాస్తారోకోలు, మానవహారం

16న ఉద్యోగులు, విద్యార్థుల ర్యాలీలు

17న ధూం ధాం

18న బంద్ కోసం బైక్ ర్యాలీలు

19న తెలంగాణ బంద్

మరోవైపు.. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైంది. విద్యా సంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, కాలేజీల బస్సులను ప్రయాణికుల తరలింపునకు వినియోగించనున్నారు. అదనపు బస్సులను సమకూర్చుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.