Amit Shah's Hyderabad Tour: అసదుద్దీన్ ఇలాఖాలో అమిత్ షా షో! సిఎఎకు మద్ధతుగా హైదరాబాద్‌లో బీజేపీ మెగా ర్యాలీ, ఎల్బీ స్టేడియంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ
ఇటీవల ఓవైసీ మాట్లాడుతూ సిఎఎపై అమిత్ షా బహిరంగ చర్చకు రావాలి అని సవాల్ విసిరారు, ఈ వ్యాఖ్యలు చేసిన కొన్నిరోజులకే....
Hyderabad, February 21: పౌరసత్వ సవరణ చట్టానికి మద్ధతుగా హైదరాబాద్‌లో మార్చి 15న భారతీయ జనతా పార్టీ మెగా ర్యాలీ (Pro-CAA Rally) చేపట్టబోతుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొననున్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయబోయే భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారని రాష్ట్ర బీజేపీ (BJP) ప్రకటించింది.
CAA, NRC మరియు NPR లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, జాతీయ స్థాయిలో నిరసనలకు ప్రాతినిధ్యం వహిస్తున్న AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి (Asaduddin Owaisi) సవాల్ చేసేలా ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గమైన హైదరాబాద్ లోనే అమిత్ షా భారీ సభ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల ఓవైసీ మాట్లాడుతూ సిఎఎపై అమిత్ షా బహిరంగ చర్చకు రావాలి అని సవాల్ విసిరారు, ఈ వ్యాఖ్యలు చేసిన కొన్నిరోజులకే అమిత్ షా హైదరాబాద్ బహిరంగ సభ ఖరారైంది.
అంతేకాకుండా సిఎఎను రద్దు చేయాలంటూ ఇటు తెలంగాణ కేబినేట్ కూడా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సిఎఎకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ (CM KCR), అప్పటికీ కేంద్ర వెనక్కి తగ్గకపోతే వివిధ రాష్ట్రాల సీఎంలు, జాతీయ స్థాయి నాయకులతో హైదరాబాద్ లోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం అని కేంద్రాన్ని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కంటే ఒక అడుగు ముందుకు వేసి అదే ఎల్బీ స్టేడియంలో భారీ సభ నిర్వహించాలనే ఆలోచన చేయడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా అటు అసదుద్దీన్ ఓవైసీని, ఇటు సీఎం కేసీఆర్ ను అమిత్ షా టార్గెట్ చేయబోతున్నారు, అలాగే ఈ సభ ద్వారా ఎంఐఎం, టీఆర్ఎస్ రెండూ ఒకే జాతికి చెందినవి అనే ప్రచారం కల్పించే ప్రయత్నం అయితే బీజేపీ చేయనుంది.
ఇక సిఎఎ పట్ల బీజేపీ సర్కార్ వైఖరి ఏంటి అనేది కూడా హైదరాబాద్ వేదికగా మరోసారి ఢంకా బజాయించి చెప్పనున్నట్లు స్పష్టమవుతుంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ టూర్ ఇప్పట్నించే పొలిటికల్ హీట్ ను పెంచేసింది.