Vallabhaneni VS Yarlagadda: గన్నవరంలో మారిన రాజకీయ సమీకరణలు, వల్లభనేని రాజీనామాతో అక్కడ ఏంజరగబోతోంది, వంశీ వైసీపీలో చేరితే యార్లగడ్డ భవిష్యత్ కార్యాచరణ ఏంటీ ?

గన్నవరం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి.

vallabhaneni-vamsi-vs-yarlagadda TDP MLA Vallabhaneni Vamsi quits party, post (Photo-Twitter)

Gannavaram, October 28: గన్నవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గన్నవరం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. దీనికి తోడు వంశీ సీఎం జగన్ తో భేటీ కావడంతో ఆయన వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.అయితే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద, ప్రభుత్వ అధికారుల మీద తనను, తన అనుచరులను వేధింపులకు గురి చేస్తున్నట్లు రాశారు. మరి వల్లభనేని వైసీపీలో చేరడానికి ఒకవేళ ఆసక్తి చూపిస్తే లెటర్ ఈ విధంగా ఎందుకు రాస్తాడానే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం మీద కృష్ణా జిల్లా రాజకీయాలు ఇప్పుడు మరోసారి హాట్ టాఫిక్ గా మారాయి.

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మార్పు విషయంలో తన నిర్ణయాన్ని పండుగ తర్వాత తెలియజేస్తానని చెప్పి పండుగ రోజే షాకింగ్ నిర్ణయాన్ని తెలియజేశారు. తనను, తన అనుచరులను వైసిపి నేతలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, గత ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచానని, ఇప్పటికీ తమపై వేధింపులు తగ్గలేదని వంశీ చంద్రబాబుకు లేఖ రాశారు.

పదవులకు రాజీనామా చేసిన వల్లభనేని వంశీ 

లేఖలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన ఎమ్మెల్యే పదవికి, టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. కాగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం వైసీపీలో చేరాలంటే ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు ఎవరైనా సరే తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని జగన్ అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే చెప్పారు.

గత ఎన్నికల్లో వైసీపీ తరపున గన్నవరం నుంచి వంశీ మీద పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంక్రటావుకు ఈ పరిణామాలు అస్సలు మింగుడు పడటం లేదు.ఆయన వంశీ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం ఖాయమని ఆయనకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవి ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్థానికంగా తన పట్టు కోల్పోతానని యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీని వైసీపీలో చేర్చుకుంటే ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారు. అధిష్టానం మీద తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాదు గతంలో టిడిపి అధికారంలో ఉన్న సమయంలో తనపై, నాలుగు వేల మంది వైసిపి నేతలపై వల్లభనేని వంశీ మోహన్ కేసులు పెట్టి వేధించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంశీని చేర్చుకోవద్దని గట్టిగానే పోరాటం చేస్తున్న యార్లగడ్డ వంశీని పార్టీలో చేర్చుకుంటే కేడర్ మనోనిబ్బరం కోల్పోతుందని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తున్నారు.

ఈ పరిణామాలు ఇలా ఉంటే వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీ లో చేరతారన్న వార్త గన్నవరం నియోజకవర్గం వైసీపీలో అలజడి సృష్టిస్తోంది. వంశీ కూడా టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత తాను తీసుకోవాల్సిన నెక్స్ట్ ఏంటి అన్న దానిపై యార్లగడ్డ తన అనుచరులతో పెద్ద ఎత్తున సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ వంశీని స్వాగతిస్తారా? యార్లగడ్డను ఒప్పిస్తా రా? అనేది ఆసక్తికర అంశంగానే మారింది. శ్రేణుల్లో తెగ టెన్సన్ క్రియేట్ చేస్తోంది.