MLA Ramesh No Longer an Indian: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు భారీ ఎదురుదెబ్బ, చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరసత్వం రద్దు, ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత, నియోజకవర్గంలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన ఆది శ్రీనివాస్....
Hyderabad, November 20: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీకి చెందిన వేములవాడ (Vemulawada Constituency) ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్(Chennamaneni Ramesh) భారతీయ పౌరసత్వం (Indian Citizenship) కోల్పోయారు. ఆయన భారతీయ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వానికి అనర్హుడని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత, నియోజకవర్గంలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు కూడా చెన్నమనేని ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే ఒకరి పౌరసత్వంపై కేంద్ర హోంశాఖనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్ట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చెన్నమనేని సుప్రీంకోర్టును ఆశ్రయించారు, అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పుతో ఏకీభవించి చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై తేల్చాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. కోర్ట్ ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ విచారణ జరిపింది. చెన్నమనేని వివరాలు సేకరించింది. చెన్నమనేని గతంలో అమెరికా నుంచి భారత్ కు వీసా పొందే విషయంలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని, ఇండియాకు వచ్చిన తర్వాత వీసా గడువు పొడిగించుకోకుండా ఉల్లంఘనలకు పాల్పడ్డారని కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. తప్పుడు సమాచారంతో భారత ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించారని చెప్తూ ఆయన ఇక ఎంతమాత్రం భారతీయుడు కాదని తేల్చేసింది. ఎవరైనా చట్ట ప్రకారమే నడుచుకోవాలని, చెన్నమనేని ఇండియాలో ఉండాలంటే వీసా తీసుకోవాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
చెన్నమనేని స్పందన ఇలా ఉంది
అయితే దీనిపై ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ స్పందించారు. ఒక భారతీయుడిగా తన పౌరసత్వ హక్కును పరిరక్షించుకునేందుకు మళ్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు రమేశ్ తెలిపారు. ద్వంద్వం పౌరసత్వం వివాదంలో జూలై 15, 2019న హైకోర్ట్ ఖచ్చితమైన ఆదేశాలను ఇచ్చిందని పేర్కొన్నారు. పౌరసత్వ చట్టం నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి యొక్క దరఖాస్తులను సమగ్రంగా, హేతుబద్ధంగా సామాజిక అంశాలను సెక్షన్ 10.3 కింద పరిగణలోకి తీసుకోవాలి. అయితే హైకోర్ట్ నిర్ధేషించిన అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం తన పౌరసత్వాన్ని రద్దు చేయడం శోచనీయమని చెన్నమనేని అన్నారు. ఇదే విషయంలో హైకోర్టులో రీ-అప్పీలుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు.