Tamil Nadu Elections 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, కొలిక్కి వచ్చిన కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంచాయితీ, కన్యాకుమారి లోక్‌సభ స్థానంతో పాటు 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం
25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో పాటు ఉపఎన్నిక జరగనున్న కన్యాకుమారి లోక్‌సభ స్థానంలోనూ కాంగ్రెస్ పోటీ చేయనుంది.
Chennai, Mar 7: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే ( DMK- Congress) మధ్య సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చింది. 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో పాటు ఉపఎన్నిక జరగనున్న కన్యాకుమారి లోక్‌సభ స్థానంలోనూ కాంగ్రెస్ పోటీ చేయనుంది. ఈ మేరకు డీఎంకే రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు. చర్చలు అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అళగిరి ప్రకటన చేశారు.
మరోవైపు బీజేపీపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అన్నాడీఎంకేతో చేతులు కలిపింది... ఆ పార్టీని ఖతం చేయడానికేనంటూ తమిళనాడు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దినేశ్ గుండూ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకవ్యక్తి పాలన కిందకు దేశాన్ని తీసుకు రావడానికి ఆ పార్టీ యోచిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో(Tamil Nadu Elections 2021) తమ కూటమి జయకేతనం ఎగరవేయడం ఖాయమని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న పోలింగ్ (Tamil Nadu Assembly Elections 2021) జరగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. డీఎంకే, కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు, ఎండీఎంకే, వీసీకే, ఐయూఎం, ఎంఎంకే కూటమిగా ఏర్పడ్డాయి. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు కేటాయించారు.
కాగా స్టాలిన్ ప్రభుత్వంతో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి క్యాబినెట్‌లోనూ పనిచేస్తానంటూ ఇటీవల డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ప్రకటించారు. అయితే ఎప్పుడూ పోటీ చేసే కాట్పాడి నియోజకవర్గం సీటును ఆశిస్తూ ఆనైకట్టు ఎమ్మెల్యే నందకుమార్ కూడా దరఖాస్తు చేసుకోవడంతో ఆ అసెంబ్లీ ఆసక్తికరంగా మారింది. వేలూరు జిల్లా కాట్పాడి శాసనసభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికలు జరిగాయి. రెండవసారి (1971)లో డీఎంకే తరఫున బరిలో నిలిచిన దురైమురుగన్ విజయం సాధించారు. అనంతరం 1989, 1996, 2001, 2006, 2011, 2016లో జరిగిన ఎన్నికల్లోనూ దురైమురుగన్ విజయం సాధించగా, 1984, 1991లో పరాజయం చవిచూశారు.
ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తామంటూ డీఎంకే నేతలెవ్వరూ దరఖాస్తు చేసుకునేందుకు కూడా సాహసించలేదు. కాట్పాడి అంటేనే డీఎంకేకు కంచుకోటగా మారింది. దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి, పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌తోనూ దురైమురుగన్‌కు సన్నిహితసంబంధాలున్నాయి. కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్ష పదవిని ఆయన కుమారుడు స్టాలిన్ చేపట్టగా, అన్బళగన్ మరణానంతరం 2020 సెప్టెంబరు 9న దురైమురుగన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన కుమారుడు కదిర్ ఆనంద్ ప్రస్తుతం వేలూరు ఎంపీగా కొనసాగుతున్నారు.