Chennai, Mar 7: తమిళనాడులో బీజేపీ- ఏఐఏడీఎంకే సీట్ల పంపకంలో గత కొద్ది రోజులుగా చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ ప్రతిష్ఠంభన తొలగిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు కొలిక్కివచ్చింది. కన్యాకుమారి పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు (Tamil Nadu Assembly elections 2021) 20 సీట్లు కేటాయించినట్లు ఏఐఏడీఎంకే తెలిపింది.
ఈ మేరకు ఒప్పందంపై శుక్రవారం రాత్రి సీఎం ఎడప్పాడి కే పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడులో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సీటీ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ సంతకాలు చేశారు.ఒప్పందం కాపీని రాత్రి మీడియాకు విడుదల చేశారు.
రాబోయే రెండు రోజుల్లో ముహూర్తం సరిగా లేనందున.. అర్ధరాత్రి సప్తమి తిథి ముగిసేలోపు ఈ ఒప్పందం చేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో 43 సీట్లను పీఎంకే, బీజేపీలకు కేటాయించింది. కనీసం 170 సీట్లలో పోటీ చేయాలని ఏఐఏడీఎంకే యోచిస్తోంది. ఇంకా జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మనీలా కాంగ్రెస్, మరో మూడు చిన్న పార్టీలకు సైతం సీట్లు కేటాయించాల్సి ఉంది.
అన్నాడీఎంకే (AIADMK) కూటమిలో పీఎంకేకు 23 సీట్లు కేటాయించడంతో జాతీయ పార్టీగా ఉన్న తమకు అంతకంటే ఎక్కువసీట్లు లభిస్తాయని ఆశపడ్డ బీజేపీ నేతలకు నిరాశే మిగిలింది. అన్నాడీఎంకే 170కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేయాలని నిర్ణయించడం వల్లే మిత్రపక్షాలకు అడిగినంత సీట్లను కేటాయించలేదని తెలుస్తోంది. చివరలో బీజేపీకి 26 స్థానాలు ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకరించింది. అయితే కన్యాకుమారి లోక్‌సభ స్థానం కూడా తమకు కావాలని బీజేపీ పట్టుబడ్డడంతో అందుకు అంగీకరించిన అన్నాడీఎంకే.. ఆరు స్థానాలు తగ్గించి, 20 శాసనసభసీట్లు మాత్రమే ఖరారు చేసింది.
సీట్ల సర్దుబాట్లపై ఒప్పందం కుదిరిన వెంటనే బీజేపీ నాయకులు తాము పోటీ చేయడానికి ఆసక్తికనబరుస్తున్న నియోజకవర్గాల జాబితాను కూడా అన్నాడీఎంకే నాయకులకు సమర్పించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు విరుదునగర్, రాజపాళయం, మదురై ఈస్ట్, మదురై నార్త్, సేలం, ఆత్తూరు, నామక్కల్, రాశిపురం, ఈరోడ్, భవానీ, తిరుప్పూరు, కోయంబత్తూర్ సౌత్, సూలూరు, కరూరు, అరవకురిచ్చి, చేపాక్-ట్రిప్లికేన్, మైలాపూరు, హార్బర్, కొళత్తూరు, చెంగల్పట్టు, ఆలందూరు, కాంచీపురం, శ్రీపెరంబుదూరు, వేలూరు, కేవీకుప్పం, కృష్ణగిరి, హోసూరు, ధర్మపురి, పళని, కారైక్కుడి, తిరువళ్లూరు లేదా తిరుత్తణి నియోజకవర్గాలలో 20 నియోజకవర్గాలను ఖరారు చేయాలని సూచించినట్టు సమాచారం.
బీజేపీకి 20 సీట్లు ఖరారు కావడంతో ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారిస్తోంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్.మురుగన్ రాశిపురంలో, ప్రముఖ సినీనటి గౌతమి రాజపాళయంలో, మైలాపూరులో కేటీ రాఘవన్, బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు వినోజ్ సెల్వం హార్బర్ నియోజకవర్గంలో, ప్రముఖ సినీనటి ఖుష్బూ చేపాక్-ట్రిప్లికేన్‌లో పోటీకి దిగాలని భావిస్తున్నారు. ఇదేవిధంగా కారైక్కుడి, కినత్తుకడవు నియోజకవర్గాలలో బీజేపీ సీనియర్ నేతలు పోటీ చేయడానికి ఆసక్తికనబరుస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలావుండగా అన్నాడీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాలను బీజేపీ అడుగుతుండటంతో ఆ ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే గెలిచేందుకు అవకాశాలున్న పలు నియోజకవర్గాలను కేటాయించాలని అన్నాడీఎంకే అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే తమ పార్టీకి 20 స్థానాలు కేటాయించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్ నిర్వేదం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే అధిష్ఠానం తమ పార్టీకి అడిగినన్ని సీట్లు ఇవ్వకుండా, 20 సీట్లను మాత్రమే కేటాయించడం పట్ల సంతోషమూ లేదు, దిగులూ లేదని పేర్కొన్నారు. తిరుచ్చిలో శనివారం ఉదయం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. తమకు కేటాయించిన 20 నియోజకవర్గాలలో గెలిచేందుకు తీవ్రంగా పాటుపడతామని చెప్పారు. తమ పార్టీకి తక్కువగా సీట్లు కేటాయించినందుకు దిగులు చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల్లో తమ కూటమి గెలిచి అధికారంలోకి రావటమే తమ ప్రధాన ఆశయమని ఆయన పేర్కొన్నారు.
కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పోటీ చేయనున్నట్టు బీజేపీ అధిష్ఠ్టానం అధికారికంగా ప్రకటించింది. కన్యాకుమారి కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు వసంత్‌కుమార్ మృతి చెందటంతో ఆ నియోజకవర్గానికి అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కన్యాకుమారి లోక్‌సభ సీటును బీజేపీకి కేటాయించింది. బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన పొన్ రాధాకృష్నన్ కన్యాకుమారిలో ఏడుసార్లు పోటీ చేశారు. 1999, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలిచారు. కన్యాకుమారిలో తనను మళ్ళీ పోటీ చేయడానికి ఆదేశించిన బీజేపీ అధిష్ఠానానికి పొన్‌రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు.