Chennai, Mar 1: తమిళనాడులో ఎన్నికల నగారా మోగడంతో అక్కడ ఎన్నికల జోరు ఊపందుకుంది. అధికార ప్రతిపక్షాలతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అక్కడ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో (Tamil Nadu Assembly Election 2021) తమిళనాడులో మూడురోజుల పాటు పర్యటించనున్న సంగతి విదితమే. ఈ సందర్బంగా ర్యాలీలు, సభలతో కాంగ్రెస్ శ్రేణులు సందడి చేస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ విద్యార్థులతో ఆడిపాడారు. తమిళనాడులోని ములగుమూదుబ్న్ సెయింట్ జోసెఫ్స్ మెట్రిక్యులేషన్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ (Rahul Gandhi Dance) చేసారు. పుష్-అప్స్, 'ఐకిడో' తో అక్కడి విద్యార్థులతో హుషారుగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో కాంగ్రెస్ శ్రేణుల్లో, అభిమానుల్లో వైరల్‌గా మారింది. తమిళనాడులో జోరుగా పర్యటిస్తున్న రాహుల్‌కు అక‍్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా నాగర్‌కోయిల్ వెళ్లేటప్పుడు ఆచంగులం గ్రామ రహదారి వద్ద తాటి ముంజెలను ఆస్వాదిస్తూ అక్కడి ప్రజలతో కలిసిపోయారు.
సోమవారం కన్యాకుమారిలో ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ.. తమిళ ప్రజలు తప్ప మరెవరూ తమిళనాడును నడపలేరు అనేది చరిత్ర చెబుతోంది. ఈ ఎన్నికల్లో కూడా ఇదే రుజువు కానుంది. తమిళనాడు ప్రజలకు నిజంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి అవుతారంటూ ఆయన జోస్యం చెప్పారు. కన్యాకుమారిలో రోడ్‌షోలో పాల్గొన్న రాహుల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi Dance, Push-Up Challenge Video
#WATCH: Congress leader Rahul Gandhi dances with students of St. Joseph's Matriculation Hr. Sec. School in Mulagumoodubn, Tamil Nadu during an interaction with them pic.twitter.com/RaSDpuXTqQ
— ANI (@ANI) March 1, 2021
View this post on Instagram
తమిళనాడు సంస్కృతిని కేంద్రం గౌరవించదు. ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి మోదీకి ప్రతినిధి ఉంటూ ఆయన ఏం చెబితే అది చేస్తారు. మోదీదాసోహం అనేవారు తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తమిళ సంస్కృతిని ఆర్ఎస్ఎస్ అవమానించే అవకాశాన్ని ముఖ్యమంత్రి ఇవ్వకూడదు. ఒకే దేశం, ఒకే సంస్కృతి, ఒకే చరిత్ర అని మోదీ చెబుతూ ఉంటారు. మరి తమిళం భారతీయ భాష కాదా? తమిళ చరిత్ర భారత చరిత్ర కాదా? అని రాహుల్ ప్రశ్నించారు. ఒక భారతీయుడిగా తమిళ సంస్కృతిని కాపాడడం తన విధి అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
కాగా తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఏప్రిల్ 6న ఒకే దశలో జరగనుండగా, మే 2న ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఈ సారి బరిలో ప్రధానంగా కాంగ్రెస్-డీఏంకే, బీజేపీ-ఏఐఏడీఎంకె కూటమి హోరీ హోరీగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.