Pooja Chavan Suicide Case: యువతిపై వేధింపుల ఆరోపణలు, మహారాష్ట్ర మంత్రి రాజీనామా, నా రాజకీయ జీవితం నాశనం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని తెలిపిన శివసేన నేత సంజయ్ రాథోడ్
Sanjay Rathod (Photo Credits: Twitter@SanjayDRathods)

Mumbai, Mar 1: టిక్ టాక్ స్టార్ పూజా చవాన్ గత వారం పుణేలో ఓ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే ఈ ఆత్మహత్య కేసులో (Pooja Chavan Suicide Case) శివసేన నాయకుని ప్రమేయం ఉందని ఆయన వేధింపుల వల్లే పూజా ఆత్మహత్య చేసుకుందని విమర్శలు సంధించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి, శివసేన నేత సంజయ్‌ రాథోడ్‌ ఆదివారం పదవికి రాజీనామా (Shiv Sena minister Sanjay Rathod resigns) చేశారు. రాజీనామా పత్రాన్ని శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు అందజేశారు.

రాష్ట్రంలో ఓ మహిళ మరణానికి సంజయ్‌ రాథోడ్‌ కారణమని ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండడంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మహిళ మరణంపై నీచ రాజకీయాలు చేస్తున్నారని సంజయ్‌ రాథోడ్‌ మండిపడ్డారు. కాగా సంజయ్ రాజీనామా చేసేంత వరకు అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ప్రతిపక్షాలు హెచ్చరించాయి. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన రాథోడ్.. పూజ ఆత్మహత్య కేసులో విచారణ పారదర్శకంగా కోరేందుకు సహకరించడం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. విచారణలో నిజాలు బయటకొస్తాయన్నారు.సత్యం నిగ్గుతేలాలన్న ఉద్దేశంతోనే మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు.

మహిళా ఐపీఎస్ అధికారిపై ప్రత్యేక డీజీపీ లైంగిక వేధింపుల కేసు, సీబీసీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ త్రిపాఠి, తమిళనాడు ప్రభుత్వం నిందితుడికి సహకరిస్తుందని ప్రతిపక్షాలు మండిపాటు

బీజేపీ తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిందని సంజయ్ ఆరోపించారు. గత 30 ఏళ్లలో తాను సంపాదించుకున్న మంచి పేరును బీజేపీ నాశం చేసిందన్నారు. బంజార తెగకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్న సంజయ్.. ప్రతిపక్షం దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసిందన్నారు. 49 ఏళ్ల రాథోడ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివసేనకు గట్టి పట్టున్న విదర్భ ప్రాంతానికి చెందిన బలమైన నేతల్లో ఆయన ఒకరు. రాథోడ్ రాజీనామా చేయడానికి ముందు.. ఆయన్ను పదవి నుంచి తప్పించొద్దని బంజార సామాజికవర్గ నేతలు సీఎంను కోరడం గమనార్హం.

కాగా మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాకు చెందిన పూజా చవాన్‌ (23) ఫిబ్రవరి 8న పుణేలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత మహిళతో మంత్రి ఉన్నట్లు, మాట్లాడినట్లుగా చెబుతున్న ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సంజయ్‌ వేధింపుల వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో రాజీనామా చేసిన తొలిమంత్రిగా సంజయ్‌ రాథోడ్‌ నిలిచారు.