West Bengal Assembly Elections 2021: టీఎంసీ- బీజేపీల మధ్య పోరు, బెంగాల్ ప్రజలు తమ పుత్రికను గెలిపించుకుంటారు, ప్రజాస్వామ్యం నిలబడుతుంది, బెంగాల్ ఎన్నికలపై ఆసక్తికర ట్వీట్ చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
ఈ నేపథ్యంలో అక్కడ పరస్పర విమర్శలతో అధికార తృణమూల్- బీజేపీ దూకుడు పెంచాయి. ప్రచారాన్ని మరింతగా రక్తి కట్టిస్తున్నాయి. ఈ ప్రచార పర్వం ఇలా ఉంటే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బెంగాల్ ఎన్నికలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా పరోక్షంగా బీజేపీకి చురకలు అంటించారు.
Kolkata, February 27: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరానికి నగారా మోగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ పరస్పర విమర్శలతో అధికార తృణమూల్- బీజేపీ దూకుడు పెంచాయి. ప్రచారాన్ని మరింతగా రక్తి కట్టిస్తున్నాయి. ఈ ప్రచార పర్వం ఇలా ఉంటే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బెంగాల్ ఎన్నికలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా పరోక్షంగా బీజేపీకి చురకలు అంటించారు.
ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకునే క్రమంలో పశ్చిమ బెంగాల్ అతిపెద్ద ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోందని, సరైన నాయకులను ఎంచుకునేందుకు, స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు బెంగాల్ ప్రజలు సన్నద్ధమయ్యారంటూ ట్వీట్ చేశారు. తమ పుత్రికనే మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని బెంగాల్ కోరుకుంటోందని సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం మమత మరోసారి విజయభేరి మోగించడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ మే 2 వరకు తనను ఫాలో అవ్వాలని టీఎంసీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి చేశారు.
పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, కేరళలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. 294 శాసన సభ స్థానాలు గల బెంగాల్‌లో 8 విడతల్లో(మార్చి 27- ఏప్రిల్ 29) పోలింగ్ జరుపనున్నట్లు సీఈసీ సునిల్ అరోరా వెల్లడించారు. అసోంలో మూడు దశల్లో, మిగిలిన ప్రాంతాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం కేంద్రం తీరుపై మండిపడ్డారు. అసోంలో ఎన్నికల ప్రచారం పూర్తిచేసుకుని బెంగాల్‌లో ప్రచారానికి వచ్చేందుకే 8 దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రచించారా అంటూ మోదీ సర్కారును విమర్శించారు.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 శాసన సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మార్చి 27 నుంచి ఎనిమిది దశల్లో జరుగనున్న ఎలక్షన్ ఫలితాలు మే 2న వెలువరించనున్నట్లు తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో(2016) 294 స్థానాలకు గానూ టీఎంసీ 211, వామపక్షాలు 79 గెలుచుకోగా బీజేపీ కేవలం 3 స్థానాలకే పరిమితం అయిన విషయం తెలిసిందే. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని మమతకు షాకిచ్చింది. అదే జోరులో టీఎంసీ కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంది. దీంతో టీఎంసీ- బీజేపీల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారనుంది.
అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఎనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది. ఈ విషయం గురించి సీఈసీ సునీల్ అరోరా మాట్లాడుతూ.. ‘‘రాజకీయ పార్టీల పేర్ల ప్రస్తావన అనవసరం. శాంతి భద్రతలను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించినప్పుడు, ఈసారి ఎనిమిది విడతల్లో ఎన్నికల నిర్వహణ పెద్ద విషయమేమీ కాదు’’ అని పేర్కొన్నారు.
పోలింగ్ తేదీలు:
►తొలి విడత: మార్చి 27
►రెండో విడత: ఏప్రిల్ 1
►మూడో విడత: ఏప్రిల్ 6
►నాలుగో విడత: ఏప్రిల్ 10
►ఐదో విడత: ఏప్రిల్ 17
►ఆరో విడత: ఏప్రిల్ 22
►ఏడో విడత: ఏప్రిల్ 26
►ఎనిమిదో విడత: ఏప్రిల్ 29
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది విడతలుగా జరపాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం అనుచితమని పేర్కొంది. ఈసీ ఎన్నికల తేదీల ప్రకటనపై టీఎంసీ నేత సౌగత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్ ఎన్నికల విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయం సమంజసంగా లేదని చెప్పారు.
తమిళనాడు, కేరళలో ఒకే రోజు, అసోంలో 3 రోజులు ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు పశ్చిమబెంగాల్‌లో 8 దశల్లో పోలింగ్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతారని అన్నారు. నెలరోజుల పాటు అన్ని కార్యక్రమాలు నిలిచిపోతాయని, అభివృద్ధి పనులు ఆగిపోతాయని చెప్పారు. 'ఇదంతా ఎన్నికల కమిషన్ ఎందుకు చేస్తోందో తెలియదు. కానీ మేము మాత్రం ఈ నిర్ణయంతో విభేదిస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు.