Andhra Pradesh local Body Elections 2020 | (Photo-PTI)

Hyderabad, Feb 23: తెలంగాణాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ (TS Graduate MLC Elections) ముగిసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ మూడు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం సాయంత్రం మూడు గంటలకు ముగిసింది. ప్రధాన పార్టీలు అయిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎం పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. కాగా నిన్న అఫిడవిట్‌ సరిగ్గా లేనందున టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి ఇవాళ నామినేషన్‌ వేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది.. అభ్యర్థులు విత్ డ్రా చేసుకోడానికి 26వ తేదీ వరకు గడువుంది.

తెలంగాణలో త్వరలో రెండు పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు (Telangana, graduate MLC elections) జరగనున్నాయి. కాగా మహబూబ్‌నగర్‌ - రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 60 మందికిపైగా అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. మార్చి14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి17న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. టీఆర్‌ఎస్‌తో పాటు విపక్ష పార్టీలు సైతం ఈ రెండు స్థానాలను ఎంతో ప్రతిష్టాత్మంగా భావిస్తున్నాయి.

గ్రేటర్ చరిత్రలో తొలిసారిగా...జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీల‌త బాధ్యతలు స్వీకరణ, జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన మేయ‌ర్

కాగా హైదరాబాద్-రంగారెడ్డి స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి బరిలో ఉండగా., బీజేపీ నుంచి రామచంద్రరావు, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ఫ్రొపెసర్‌ నాగేశ్వర్‌ పోటీలో నిలిచారు. మరోవైపు ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి రాములు నాయక్‌తో పాటు కోదండరాం, జయసారధి రెడ్డి, తీన్‌మార్‌ మల్లన్న, ప్రేమేందర్‌ రెడ్డి, రాణిరుద్రమ దేవి వంటి ప్రముఖులు పోటీపడుతున్నారు.

మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి స్థానానికి టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ ఈ రోజు నామినేష‌న్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రాజ‌కీయాలకు అతీతంగా జ‌ర‌గాల‌ని అన్నారు. త‌న‌ను గెలిపిస్తే అన్ని వ‌ర్గాల వారి స‌మ‌స్య‌ల‌ను శాన‌స మండ‌లిలో ప్ర‌భుత్వానికి వినిపిస్తాన‌ని చెప్పారు. టీడీపీ హ‌యాంలోన‌నే రంగారెడ్డితో పాటు హైద‌రాబాద్ అభివృద్ధి చెందింద‌ని తెలిపారు. యువ‌త‌కు ఉద్యోగాల‌ను క‌ల్పించే విష‌యంలో కేంద్ర స‌ర్కారుతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని చెప్పారు.