Hyderabad, Feb 22: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత రెడ్డి (Mote Srilatha Reddy) సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్ చరిత్రలో ఇద్దరు మహిళలు మేయర్, డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడ ఇదే తొలిసారి. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు హాజరయ్యారు.
మేయర్, డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి, శ్రీలత రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 11వ తేదీన మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.
మేయర్ గా ఎన్నికై గద్వాల విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) పాఠశాల విద్యను హైదరాబాద్‌లోని హోలీ మేరి స్కూల్‌లో పూర్తిచేశారు. అనంతరం రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఇంటర్, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం చేశారు. సుల్తాన్ ఉల్ లూమ్ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. వివాహానంతరం ఆమె 18 ఏండ్లపాటు అమెరికాలో ఉన్నారు. ఆ సయమంలో ఉత్తర కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రిసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు.
2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా భారీ విజయం సాధించారు. డివిజన్ అభివృద్ధికి తనవంతుగా కృషిచేశారు. మేయర్ గా ఎన్నికైన విజయలక్ష్మి టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవ్ రావు కుమార్తె. ఆయన టిఆర్ఎస్ లోకి ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన మోతె శ్రీలత (TRS Corporator Mote Sri Latha ) BA చేశారు. కొంతకాలంపాటు టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.ఆమె భర్త మోతె శోభన్ రెడ్డి, ఇద్దరు పిల్లలు రాజీవి, శ్రీతేజస్వి. గత 20 ఏళ్ల నుంచి బొటిక్ నిర్వహణ రంగంలో ఉన్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన పౌర ఎన్నికలలో టిఆర్‌ఎస్ 56 సీట్లు మాత్రమే గెలుచుకోగా, 150 మంది సభ్యుల జిహెచ్‌ఎంసిలో బిజెపి 48 స్థానాలు సాధించింది. గెలిచిన అభ్యర్థి మరణం తరువాత బిజెపి బలం 47 కి పడిపోయింది. ఎన్నికలలో AIMIM 44 వార్డులను కైవసం చేసుకుంది. జిహెచ్‌ఎంసిలో మొత్తం 44 ఎక్స్-అఫిషియో సభ్యుల ఓట్లు ఉన్నాయి. వీటిలో టిఆర్‌ఎస్‌లో 32, ఎంఐఎం 10, బిజెపి 2 ఉన్నాయి. బిజెపికి సంఖ్యా బలం లేకపోయినప్పటికీ, మేయర్ మరియు డిప్యూటీ మేయర్ ఎన్నికలలో పోటీ చేసింది.