TSRTC Strike- Day 14: సమ్మె తీవ్రం.. ఫలితం శూన్యం. టీఎస్ ఆర్టీసీ సమ్మె రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తుందా? సమ్మె పట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉంది? వివరణాత్మక కథనం

ఉద్యోగ సంఘాల నేతలు కూడా రేపు ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే వారికి ఇతర సంఘాల నుంచి మద్ధతు దక్కదన్న భయంతోనే అనివార్య పరిస్థితుల్లో మద్ధతిస్తున్నాయే తప్పా, అయ్యో పాపం ఆర్టీసీ కార్మికులు అని ఎవరూ ముందుకు రావడం లేదు....

14th Day of TS RTC Strike | File Photo

Hyderabad, October 18:  ఒక సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. 'జింకను వేటాడేటపుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా?, అట్లాంటపుడు మరి పులిని వేటాడేటపుడు మనమెంత ఓపికగా ఉండాలి' అని. ఈ డైలాగ్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డికి వర్తిస్తుంది.  ఇక్కడ ప్రభుత్వం పులి అని కాదు, కార్మికులు జింకలు అని చెప్పే ఉద్దేశ్యం కాదు. ప్రభుత్వంతో పోల్చినపుడు కార్మిక సంఘాల బలం ఎంత అని చెప్పటానికి ఒక ఉదాహరణ మాత్రమే.  ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సమ్మె చేసుకునే హక్కు ఉంటుంది. కానీ ఆ సమ్మెను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే అందుకు సమర్థవంతమైన నాయకత్వం అవసరం. సాధించాలనే పట్టుదల, ఆవేశం ఉండగానే సరిపోదు. అందుకు సరైన సమయం, ఓపిక, వివేకం కలిగి ఉండాలి.  పొట్టేలు వెళ్లి కొండను ఢీకొంటే పగిలేది పొట్టేలు తలనే కానీ, కొండకేమి కాదు. ఈ విషయాన్ని విషయాన్ని అశ్వత్థామ రెడ్డి గ్రహించాలి.  ఇరు పక్షాల మొండి వైఖరి వల్ల వారాలు గడుస్తున్నా ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) కు ఒక దశ-దిశా లేకుండా ఎక్కడ మొదలైందో అక్కడే ఉంది. యూనియన్లు ఎంత ఉదృతంగా సమ్మె చేస్తే, ప్రభుత్వం అంత పకడ్బందీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రభావం ఏ మాత్రం కనిపించకుండా పోతుంది.

ఏ ప్రభుత్వ పెద్దలైనా దిగిరావాలంటే అందుకు ప్రజల మద్ధతు అవసరం. మరి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రజామద్ధతు ఎక్కడ ఉంది? ఈ సమ్మె కారణంగా కలిగే నష్టాలు ఏ ప్రభుత్వమైనా మళ్ళీ రుద్దేది ప్రజలపైనే, అది ప్రజలకు బాగా తెలుసు.

ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు మద్ధతు పలుకుతున్నవారంతా వారి వారి స్వప్రయోజనాలు ఆశించే తప్ప, ప్రజల కోసం కాదు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా రేపు ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే వారికి ఇతర సంఘాల నుంచి మద్ధతు దక్కదన్న భయంతోనే అనివార్య పరిస్థితుల్లో మద్ధతిస్తున్నాయే తప్పా, అయ్యో పాపం ఆర్టీసీ కార్మికులు అని ఎవరూ ముందుకు రావడం లేదు.

దీనికి తోడు మధ్యలో ఓలా, ఊబర్ కూడా మాకూ  డిమాండ్లు ఉన్నాయి, మాకూ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలి అంటూ దూరుతున్నాయి. ఇవన్నీ ప్రజల ముక్కు పిండి డబ్బు వసూలు చేయడానికే కదా? దీనిని ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? ఆపై తమ సమ్మెకు ప్రజలంతా ఏకమవ్వాలి అని పిలుపులివ్వడం ఎంత అవివేకం? ఇవి ప్రజలకు తెలియవా?

గతంలో తెలంగాణ ఉద్యమానికి ముందు 200 కి.మీల దూరానికి ఎక్స్‌ప్రెస్ బస్ ఛార్జి రూ. 90 ఉండేది, ఉద్యమంలో భాగంగా చేపట్టిన ఆర్టీసీ సమ్మె కారణంగా, ఆ తర్వాత ఆ దూరానికి పెరిగిన బస్సు ఛార్జి రూ.200 అంటే రెట్టింపు కంటే ఎక్కువే. ఇప్పుడు సమ్మె చేస్తున్నారని ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చుకుంటూ పోతే ఆ భారం మోసేది కూడా సామాన్య ప్రజలే.

ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రజల్లో సదాభిప్రాయం లేదు. ఇక తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని దించుతాం అని బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడితే అది జనాల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తుంది.  రాష్ట్రంలో ఒక్క ఆర్టీసీవి, ఉద్యోగ సంఘాలవే సమస్యలా? మిగతా సమస్యలు ఏం లేవా? ప్రైవేట్ ఉద్యోగులు రోజంతా కష్టపడినా చాలీచాలని జీతాలతో గడిపేస్తున్నారు. నిరుద్యోగులకు కనీసం ఈ ఉద్యోగమూ లేదు, రైతుల ఆత్మహత్యలు అలాగే ఉన్నాయి. ఈ సమ్మెల కారణంగా రాష్ట్రంలోని అసలు సమస్యలు పక్కదారి పట్టడమో, అసలు వెలుగులోకి రాకపోవడమో జరుగుతుంది. అని కొన్ని వర్గాల నుంచి వెలువడుతున్న అభిప్రాయం.

చర్చలకు సిద్ధమే, చర్చలకు మమ్మల్ని ఆహ్వానించాలని అశ్వత్థామ రెడ్డి నేడు మాట్లాడటం మంచి పరిణామమే, అయితే ఒకవైపు ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతూ, మరోవైపు మాతో ప్రభుత్వం చర్చించాలంటే అది సాధ్యమేనా? ఈ సమ్మె ప్రారంభానికి ముందే తెలంగాణ మంత్రివర్గం ఆర్టీసీ సమస్యలపై చర్చించేందుకు ఒక కమిటీ వేసింది. కానీ, ఆ కమిటీతో సరైన చర్చలు జరపకుండానే నేరుగా సమ్మెకు వెళ్లడం అత్యుత్సాహమే అవుతుంది. మొన్న హైకోర్ట్ కూడా ఇదే విషయాన్ని సూటిగా చెప్పింది. సమస్యల పరిష్కారంలో ఎలాంటి మార్పు రానప్పుడు చివరి అస్త్రంగా సమ్మెను ఉపయోగించాలి, ప్రారంభంలోనే చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తే ఎలా అని హైకోర్ట్ ప్రశ్నించింది. ఏ కోర్టులైనా ప్రభుత్వానికి సూచనలు చేస్తాయే తప్ప, ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకునేంత పరిధి కోర్టులకు కూడా చాలా పరిమితం.

ఇప్పటికైనా కార్మిక సంఘాలు మెట్టు దిగి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా దశల వారీగా తమ సమస్యలు పరిష్కరించుకుంటే మంచింది. ఇటు ప్రభుత్వమూ, వారంతా 'సెల్ఫ్ డిస్మిస్డ్' అనే పదాలు ఉపయోగించకుండా సమ్మె చేస్తున్న కార్మికులను విధులకు ఆహ్వానించి వారితో చర్చలు జరపడం మంచిది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కార్మికులు, ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే వారిని నమ్ముకొని కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కార్మికుల విషయంలో మొండికి పోకుండా పెద్ద మనసుతో వారిని ఆదరించాలి. దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలను చూసిన తెలంగాణ ప్రజానీకానికి తమ పట్ల ఏ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే విజ్ఞత ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమూ ఎలాంటి ప్రజావ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్లినా.. సరైన సందర్భం వచ్చినపుడు, ఖచ్చితంగా దాని ఫలితం ఎలా ఉంటుందనేది ప్రజలు చూపిస్తారు.