CAA at Supreme Court: పౌరసత్వ సవరణ చట్టంపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్ట్, కేంద్ర ప్రభుత్వానికి మాత్రం నోటీసులు జారీ, తదుపరి విచారణ జనవరికి వాయిదా
మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న ఈ చట్టాన్ని ఉపసంహరించాలని....
New Delhi, December 18: పౌరసత్వ సవరణ చట్టాన్ని (Citizenship Amendment Act, 2019) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది, జనవరి 2వ వారం లోపు దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అయితే ఈ కొత్త చట్టం అమలుపై స్టే ఇవ్వడానికి మాత్రం సుప్రీంకోర్ట్ నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 22, 2020కి వాయిదా వేసింది.
అస్సాం కాంగ్రెస్ నాయకుడు జయరామ్ రమేష్, బిజెపి మిత్రపక్షం అయిన అసోమ్ గణ పరిషత్ తదితరులు సిఎఎకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎస్‌ఐ బొబ్డే (SA Bobde) నేతృత్వంలో జస్టిస్ బిఆర్ గవై మరియు జస్టిస్ సూర్య కాంత్ న్యాయమూర్తులుగా ఉన్న ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది.
Check ANI Tweet Below:
అంతకుముందు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష నాయకులతో కలిసి మంగళవారం నాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న ఈ చట్టాన్ని ఉపసంహరించాలని రాష్ట్రపతికి వారు విజ్ఞప్తి చేశారు. సోనియా గాంధీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నాయకులు ఎకె ఆంటోనీ, ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రెయిన్, సిపిఐకి చెందిన డి రాజా, సిపిఐ (ఎం) నుంచి సీతారాం ఏచురీ, ఆర్జెడి నుంచి మనోజ్ మరియు లోకాంత్రిక్ జనతాదళ్ పార్టీ నేత శరద్ యాదవ్ రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా ఆస్తుల విధ్వంసానికి పాల్పడితే వారిని అక్కడే కాల్చిపారేయండి: కేంద్ర మంత్రి ఆదేశాలు
పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ చట్టం తమ హక్కులను, తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉందని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఉద్యమిస్తుండగా, మతప్రాతిపదికన రూపొందించిన ఈ చట్టం సెక్యులరిజానికి విఘాతం కలిగిస్తుందని, ముస్లింల హక్కులను అణిచివేసేలా ఉందంటూ దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పలు ఆస్తుల విధ్వంసం, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. CAA నేపథ్యంలో దేశంలో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ చట్టంతో దేశంలోని పౌరులకు ఎలాంటి నష్టం కలగదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఎవరి హక్కులకు భంగం కలిగించదు, అందుకు నాది హామి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నారు.