Blast at TMC Leaders Residence: బెంగాల్ టీఎంసీ నేత ఇంట్లో పేలుడు, ముగ్గురు మృతి, పలువురికి గాయాలు, ఇంట్లోనే నాటుబాంబులు తయారు చేస్తున్నారంటూ బీజేపీ నేతల ఆరోపణ
తృణమూల్ నాయకుడి ఇంటి వద్ద కంట్రీ మేడ్ బాంబులు (Country made bomb) సిద్ధమవుతున్నాయని బీజేపీ ఆరోపించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. రాష్ట్రంలో బాంబుల తయారీ పరిశ్రమ మాత్రమే అభివృద్ధి చెందుతోందని విమర్శలు గుప్పించారు.
Kolkata, DEC 03: పశ్చిమబెంగాల్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్ భూపతినగర్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడి ఇంటిలో జరిగిన బాంబు పేలుడు (Blast) ఘటనలో ముగ్గురు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. తూర్పు మిడ్నాపూర్‌లోని కాంటాయ్‌కు (Kantai) 40 కిలో మీటర్ల దూరంలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటన శుక్రవారం రాత్రి 11.15గంటల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ బూత్ అధ్యక్షుడి (TMC booth president’s residence) ఇంట్లో సంభవించింది. పేలుడు దాటికి ఇల్లుకూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. బాంబు పేలుడు ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. టీఎంసీ నేత ఇంటిపైభాగం గడ్డితో కప్పబడి, మట్టి ఇంటిని పోలి ఉంటుంది. బాంబు పేలుడు దాటికి ఇంటిపైభాగం పూర్తిగా ఎగిరిపోయింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకొనేపనిలో నిమగ్నమయ్యారు.
ఇదిలాఉంటే, పేలుడు ఘటనపై బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలుచేశారు. తృణమూల్ నాయకుడి ఇంటి వద్ద కంట్రీ మేడ్ బాంబులు (Country made bomb) సిద్ధమవుతున్నాయని బీజేపీ ఆరోపించింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. రాష్ట్రంలో బాంబుల తయారీ పరిశ్రమ మాత్రమే అభివృద్ధి చెందుతోందని విమర్శలు గుప్పించారు. ఇలాంటి ఘటనలపై సీఎం మమతా బెనర్జీ (Mamatha Benarjee) ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. టిఎంసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ లో ఎలాంటి ఆధారాలు లేకుండా అధికార పార్టీని నిందించడం ప్రతిపక్షాలకు చాలా తేలిక అంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కూంబింగ్ కార్యకలాపాలను ప్రారంభించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారని అధికార టీఎంసీ చెబుతున్నారు. గత 2018 పంచాయతీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వచ్చే కొద్దిరోజుల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే పోలీసులు చర్యలు చేపట్టారు.