Femina Miss India 2020: ఫెమినా మిస్ ఇండియా 2020 విజేతగా హైదరాబాదీ, మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్న మానస వారణాసి, డిసెంబర్ 2021లో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం
మిస్ ఇండియా 2020 విజేతను ఫిబ్రవరి 11, 2021న ప్రకటించారు. హైదరాబాద్ కు చెందిన 23 ఏళ్ల మానస వారణాసి విఎల్‌సిసి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటాన్ని దక్కించుకుంది. హరియాణకు చెందిన మణికా షియోకాండ్ మిస్ గ్రాండ్ ఇండియా 2020గా ఎంపికవగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్య సింగ్ మిస్ ఇండియా 2020 - రన్నరప్‌గా నిలిచింది.
విజేతను ఎంపిక చేసే జ్యూరీ ప్యానెల్‌లో బాలీవుడ్ నటులు నేహా ధూపియా, చిత్రాంగద సింగ్, పుల్కిత్ సామ్రాట్ లతో పాటు ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్స్ ఫాల్గుని మరియు షేన్ పీకాక్ ఉన్నారు. ఈ పోటీ యొక్క ప్రారంభ రౌండ్ కు మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు. మిస్ ఇండియా పోటీ యొక్క గ్రాండ్ ఫినాలే ఫిబ్రవరి 28న కలర్స్ టీవీ ఛానెల్‌లో ప్రసారం కానుంది.
ఇక మిస్ ఇండియా హైదరాబాద్ వాసి కావడంతో ఆమె ఎవరు, నేపథ్యం ఏంటనే దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. హైదరాబాదులో ఇంజినీరింగ్ పూర్తి చేసిన మానస, ఒక కార్పోరేట్ సంస్థలో ఫైనాన్షియల్ అనలిస్టుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆమె మిస్ ఇండియా కిరీటం కైవసం చేసుకోవడంతో, డిసెంబర్ 2021లో జరిగే 70వ మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.