Medaram Jathara 2020: నేడు మేడారం జాతరలో ప్రాధాన్యమైన రోజు, భక్తులకు దర్శనమివ్వనున్న సమ్మక్క-సారలమ్మలు, వనదేవతలను దర్శించుకోనున్న సీఎం, గవర్నర్ మరియు ఇతర వీఐపీలు
సమ్మక్క- సారలమ్మలను దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చి దేవతల దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకోనున్నారు.....
Mulugu, February 7: మేడారం జాతరలో ( Medaram Jathara 2020) అసలైన రోజు, అద్భుతమైన రోజు రానే వచ్చింది. శుక్రవారం సమ్మక్క - సారలమ్మలు (Sammakka- Saralamma) భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దేవతల రాకతో మేడారం పరిసరాలు కోలాహలంగా మారిపోయాయి, భక్తజనసంద్రం పులకించిపోయింది.
జాతరలో (Medaram shrine) కీలక ఘట్టం అయిన సమ్మక్క ఆగమనం గురువారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. పూజారుల ప్రత్యేక పూజలతో, ప్రభుత్వ అధికార లాంఛనాలతో పెద్దమ్మ ఆగమనమే ఓ అద్భుత ఘట్టం. అమ్మ రాకను సూచిస్తూ భద్రతా సిబ్బంది గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరపగా, తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేంధర్, సత్యవతి రాఠోడ్, ములుగు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పెద్దమ్మకు సాదర స్వాగతం పలుకగా, లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల హోరెత్తగా, శివసత్తుల నృత్యాలు, పూనకాల మధ్య, ఆదివాసీల ఆటపాటలు, తుడుందెబ్బల నడుమ తల్లిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఘనంగా ఆహ్వానంతో రాత్రి 9:10 గంటలకు సమ్మక్క తల్లి గద్దెపైన ఆసీనులయ్యారు. దీంతో జాతరలోని ప్రధాన కార్యక్రమం నేడు ప్రారంభమైంది. మేడారం జాతరకు ఎలా చేరుకోవచ్చు?
అంతకుముందు రోజు సమ్మక్క భర్త పగిడిద్ద రాజు, కుమార్తె సారలమ్మ, అల్లుడు గోవిందరాజు, కుమారుడు జంపన్న గద్దెపైన ఆసీనులయ్యారు, ఇప్పుడు వారితో సమ్మక్క కూడా ఆసీనులవడంతో మేడారం నిండుగా కొత్త శోభను సంతరించుకుంది.
లక్షలుగా తరలివచ్చిన భక్తులకు సమ్మక్క- సారలమ్మలు నేడు తమ దర్శన భాగ్యం కల్పించనున్నారు. సంప్రదాయం ప్రకారం, జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించి భక్తులు వనదేవతల దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకోనున్నారు. ఒడిబియ్యం, బోనాలు, సారెలు సమర్పించి బంగారం (కొత్త బెల్లం)తో దేవతలను కొలుస్తారు.
Medaram Jathara Video:
మేడారం ఇప్పటికే భక్తజనంతో కిక్కిరిసిపోయింది. గురువారం ఒక్కరోజే 40 లక్షల మంది మేడారం చేరుకున్నారని అంచనా, దేవతలు ఆసీనులవడంతో నేడు భక్తులు మరింతగా పోటెత్తనున్నారు. అంతేకాకుండా శుక్రవారం అమ్మల దర్శనం కోసం వీఐపీల తాకిడి కూడా అధికంగా ఉండనుంది. సమ్మక్క- సారలమ్మలను దర్శించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చి దేవతల దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకోనున్నారు.