Medaram Jathara 2020: మేడారం భక్తులకు ఉచిత వైఫై, ప్రారంభమైన సమ్మక్క- సారలమ్మల మహాజాతర, జనసంద్రంగా మేడారం, నాలుగు మార్గాల్లో మేడారం చేరుకోవచ్చు
Medaram Jathara 2020 | Photo: Twitter

Warangal/ Mulugu, February 05: తెలంగాణ కుంభమేళా, సమ్మక్క- సారలమ్మల మేడారం మహాజాతర బుధవారం ప్రారంభమైంది. నేటి నుంచి శనివారం వరకు నాలుగు రోజుల పాటు ఈ మహాజాతర జరగనుంది. ఈసారి దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జాతరకు హాజరయ్యే ప్రతీ భక్తుడి గుండెల్లో మేడరం జాతర ఓ చిరస్మరణీయమైన సంఘటన కావాలని సీఎం కేసీఆర్ ఆధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వ యంత్రాంగమంతా శాఖల వారీగా మేడారం వద్ద అన్ని ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ స్థలాల ఏర్పాటు మొదలుకొని, అవసరమయ్యే వసతులు, వైద్య సేవలు, భద్రత, రవాణా ఏర్పాట్లు చేశారు. ఇంటర్-సెక్టోరల్ బృందాలు పరిస్థితిని అంచనా వేసి ఏదైనా సమస్య వస్తే వేగంగా స్పందించాలని ప్రభుత్వ పరంగా ఆదేశాలు జారీచేశారు.  మేడారం జాతరలో ఏ రోజు, ఏం జరుగుతుంది?

మేడారం వచ్చే భక్తుల సౌకర్యార్థం బీఎస్ఎన్ఎల్ ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఉచిత వైఫై సేవలు అందిస్తుంది. నిరంరతాయమైన ఇంటర్నెట్ కోసం జాతర పరిసరాల్లో 20 చోట్ల వైఫై హాట్ స్పాట్ లను ఏర్పాటు చేసింది. మొబైల్ లో వైఫై ఆన్ చేసి QFI-BSNL- FREE-WIFI @ Medaram కనెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత బ్రౌజర్ లో మొబైల్ నెంబర్, ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే వైఫై కనెక్ట్ అవుతుంది.

 

మేడారం జాతరకు ఎలా చేరుకోవచ్చు?!

 

ఇక మేడారం జాతర వెళ్లేందుకు రైలు, బస్సు, హెలికాప్టర్, ప్రైవేట్ వెహికిల్స్ ప్రత్యేకంగా మేడారానికి సర్వీసులు అందిస్తున్నాయి. ఎక్కడినుంచైనా ముందుగా వరంగల్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ్నించి ములుగు పట్టణం వైపు ప్రయాణం చేయాలి.

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్- వరంగల్ రూట్లో 10 ప్రత్యేక రైళ్లు, సిర్పూర్, కాగజ్ నగర్- వరంగల్ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నాయి.

వరంగల్ నుంచి టీఎస్ ఆర్టీసీ మేడారం వరకు ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

తెలంగాణ టూరిజం శాఖ అధ్వర్యంలో నడిచే హెలికాప్టర్స్ ద్వారా కూడా మేడారం చేరుకోవచ్చు. చాపర్ ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ. 2999/- ఛార్జి చేస్తారు, బుకింగ్స్ కోసం ఈ నెంబర్ కు 9400399999 కాల్ చేయాలి.

ఇక పలు ప్రదేశాల నుంచి ప్రైవేట్ వెహికిల్స్ కూడా సర్వీసులు నడుపుతున్నాయి. ప్రైవేట్ వాహనాలకు జంపన్న వాగు సమీపంలో పార్కింగ్ కేటాయించారు. అక్కడ స్నానాలు చేసి, 2 కిమీ దూరంలో ఉన్న మేడారం నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అయితే మేడారం మార్గమధ్యంలో పర్యాటక ప్రదేశాలైన లక్నవరం చెరువు, బొగత జలపాతం, రామప్ప టెంపుల్, వరంగల్ భద్రకాళి టెంపుల్, వేయి స్థంభాల గుడి లాంటివి చూడొచ్చు.